రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విజయవాడ (Vijayawada) కృష్ణలంక (Krishnalanka) యువకుడు గాదె సాయికృష్ణ (Gade Sai Krishna) లాకప్‌డెత్ (Lock-up Death) కేసులో బాధిత తల్లి(Mother) న్యాయపోరాటం మరింత తీవ్రరూపం దాల్చింది. సాయికృష్ణ మరణంపై జ్యుడీషియల్ విచారణ (Judicial Inquiry) జరిపించాలని కోరుతూ ఆయన తల్లి విజయలక్ష్మి (Vijayalakshmi) దాఖలు చేసిన పిటిషన్‌పై జిల్లా కోర్టు గురువారం సుదీర్ఘ విచారణ చేపట్టింది. బాధితురాలి తరఫున కోర్టులో హాజరైన న్యాయవాదులు.. ఈ కేసు విచారణ సాగుతున్న తీరుపై, సిట్ (SIT) అధికారులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులోని (Remand Report’s) లోపాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వాదనలు వినిపించారు.
బాధితురాలి తరఫు న్యాయవాదులు (Lawyers) ప్రధానంగా పోలీసుల దర్యాప్తులోని లోపాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌తో పాటు సాయికృష్ణ మృతదేహాన్ని (Dead Body) తగలబెట్టినట్లు అనుమానిస్తున్న స్వర్గపురి శ్మశాన వాటికకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు (CCTV Footage) పూర్తిగా మాయం కావడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే, నిందితుడైన కృష్ణలంక సీఐ నాగరాజుపై(CI Nagaraju) అదే హోదాలో ఉన్న పటమట సీఐ విచారణ జరపడం ఏంటని, ఇది కేసును పక్కదారి పట్టించే ప్రయత్నమేనని నిలదీశారు. అన్నింటికంటే ముఖ్యంగా, సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, అది ఏమైంది అనే కీలకమైన అంశాన్ని సిట్(SIT) అధికారులు తమ రిమాండ్ రిపోర్టులో ఇప్పటికీ స్పష్టంగా పేర్కొనకపోవడాన్ని తప్పుబట్టారు.
ఇరుపక్షాల వాదనలను విన్న జిల్లా న్యాయస్థానం ఈ కేసులో కీలకమైన డిజిటల్ సాక్ష్యాధారాల (Digital Evidence) సేకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. మాయమైనట్లు చెబుతున్న సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పునరుద్ధరించేందుకు, వాటి నివేదిక కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి కోర్టు తక్షణమే నోటీసులు జారీ చేసింది. దీనితో పాటు, ఈ దారుణ ఘటనపై పూర్తి వివరాలను కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్ (Vijayawada Police Commissioner), విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ (Municipal Corporation Commissioner), ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌కు (Collector) న్యాయస్థానం అధికారికంగా నోటీసులు జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసులో సాక్ష్యాల ధ్వంసం, ఉన్నతాధికారుల బాధ్యతపై కోర్టు జారీ చేసిన నోటీసులు ప్రస్తుతం పోలీస్, పరిపాలనా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. నోటీసుల జారీ అనంతరం జిల్లా కోర్టు ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 29వ తేదీకి (జూన్ 29) వాయిదా వేసింది. ఆ రోజున పోలీస్ కమిషనర్, కలెక్టర్, వీఎంసీ కమిషనర్ల నుంచి వచ్చే నివేదికలు ఈ లాకప్‌డెత్ కేసులో మరింత కీలక మలుపుగా మారనున్నాయి.







