విజయవాడలో తెరపైకి మరో సంచలన కేసు (Video)

విజయవాడలో తెరపైకి మరో సంచలన కేసు

రాష్ట్రంలో పోలీసుల(Police) అక్రమాలు, కేసుల తారుమారు వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటపడుతూ పోలీస్ శాఖ ప్రతిష్టను మంటగలుపుతున్నాయి. గాదె సాయికృష్ణ(Gade Sai Krishna) లాకప్‌డెత్(Lockup Death) ఉదంతం కాక‌మీద ఉండ‌గానే.. విజయవాడలో(Vijayawada) మ‌రో సంచ‌ల‌న కేసు వెలుగులోకి వ‌చ్చింది. వన్‌టౌన్ పోలీసుల అమానుషత్వం బట్టబయలైంది.

ప్రేమ(Love) పేరిట లోబరుచుకుని, అత్యాచారం(Rape) చేసి, ఓ 14 ఏళ్ల మైనర్ బాలికను(Minor Girl) దారుణంగా హత్య(Murder) చేస్తే.. అప్పటి వన్‌టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్ నిందితులతో బేరాలు ఆడి, కేసును పూర్తిగా తప్పుదోవ పట్టించారని మృతురాలి త‌ల్లి ఆరోపించింది. ఏకంగా 14 ఏళ్ల మైనర్ బాలిక వయస్సును ఎఫ్ఐఆర్‌లో 30 ఏళ్లుగా నమోదు చేసి, నిందితులకు కొమ్ముకాసిన వన్‌టౌన్ పోలీసుల నిర్వాకంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బుధవారం చిట్టినగర్ కేఎల్ రావు నగర్‌లో(KL Rao Nagar) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మృతురాలి తల్లి గుర్రం దుర్గ(Gurram Durga), సోదరి రాపర్తి కొండమ్మ(Raparthi Kondamma) తమకు జరిగిన అన్యాయాన్ని కన్నీటిపర్యంతమవుతూ వివరించారు. బాధితురాలి త‌ల్లి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వన్‌టౌన్ మల్లికార్జునపేట కొండ ప్రాంతంలో నివసిస్తున్న క్రమంలో గుర్రం బుజ్జమ్మ(Gurram Bujjamma) అలియాస్ శ్రీదేవి (Sridevi)(14) అనే మైనర్ బాలిక ఆగస్టు 2017లో అదృశ్యమైంది. దీనిపై కుటుంబ సభ్యులు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వేల్పూరు వంశీ(Vamsi) అనే యువకుడు ప్రేమ పేరిట తన కుమార్తెను లొంగదీసుకుని, అతని బంధువులతో కలిసి అత్యాచారానికి పాల్పడి, హత్య చేసి ఉంటాడని అప్పట్లోనే తల్లి పోలీసుల వద్ద అనుమానం వ్యక్తం చేసింది.

31 ఆగస్టు 2017న బందర్ లాకులు వద్ద లభ్యమైన ఒక అపరిచిత మృతదేహానికి సంబంధించిన ఫోటోలను అప్పటి వన్‌టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) కాశీ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి చూపించారు. దుస్తులు, ఆభరణాలు, చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా అది తమ కుమార్తె బుజ్జమ్మదేనని తల్లి నిర్ధారించుకుంది. కానీ, పోలీసులు ఆ మృతదేహాన్ని నేటికీ త‌మ‌కు అప్ప‌గించ‌కుండా మాయం చేశార‌ని ఆ త‌ల్లి క‌న్నీరుపెట్టుకుంది.

కుమార్తె శవాన్ని కూడా ఆఖరి చూపు దక్కకుండా చేసిన పోలీసులు.. నిందితులను రక్షించేందుకు కేసును పూర్తిగా ఫ్యాబ్రికేట్ చేశారని తల్లి గుర్రం దుర్గ ఆరోపించారు. “అప్పటి వన్‌టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్(Kashi Viswanath) నా కుమార్తెను చంపేసిన నిందితులతో కలిసి బేరాలు ఆడాడు. కేసును నీరుగార్చడానికి చనిపోయేనాటికి 14 ఏళ్లు ఉన్న నా కుమార్తె వయస్సును ఎఫ్ఐఆర్‌లో(FIR) ఏకంగా 30 ఏళ్ల మహిళగా మార్చేసి తప్పుడు రికార్డులు సృష్టించారు” అని దుర్గ ఆవేదన వ్యక్తం చేశారు.

పోలీసులు కేసును తప్పుదోవ పట్టించినా ఆ తల్లి అధైర్యపడలేదు. తన కుమార్తె మైనర్ అని నిరూపించడానికి బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులను సేకరించి రాష్ట్ర హైకోర్టు మెట్లు ఎక్కింది. 2017 నుంచి ఆమె నిరంతరాయంగా చేసిన న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలితాన్నిచ్చింది. ఆధారాలను పరిశీలించిన హైకోర్టు.. చనిపోయే నాటికి బాధితురాలి వయస్సు 14 ఏళ్లేనని నిర్ధారించింది. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సాధారణ క్రిమినల్ కేసును పోక్సో (POCSO) కేసుగా (SC 1426/2026) నమోదు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వేగంగా సాగేందుకు కేసును జిల్లా కోర్టుకు సరెండర్ చేసింది.

హైకోర్టు(High Court) ఆదేశాలతో కేసు పోక్సోగా మారినప్పటికీ.. నిందితుడు వేల్పూరు రాజేష్ (వంశీ కుటుంబ సభ్యులు), అతని బంధువులు ప్రస్తుతం బెయిల్‌పై(Bail) తిరుగుతూ తమను అంతమొందిస్తామని బెదిరిస్తున్నారని బాధిత కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది. రాజేష్ కుటుంబం (Rajesh Family) నుంచి తమకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు రక్షణ కల్పించాలని న్యాయస్థానాన్ని, ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఒక మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసును(Murder Case) పక్కదారి పట్టించి, ఎఫ్ఐఆర్‌లో వయస్సు మార్చి నిందితులకు కొమ్ముకాసిన అప్పటి వన్‌టౌన్ సీఐ కాశీ విశ్వనాథ్‌తో పాటు సంబంధిత పోలీసులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లి గుర్రం దుర్గ డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment