గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు (Village,Ward Secretariat Employees) చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమం (Chalo Vijayawada Program) ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రవ్యాప్తంగా విజయవాడకు తరలివచ్చిన ఉద్యోగులను పోలీసులు(Police) ఉక్కుపాదం మోపారు. పలుచోట్ల అడ్డుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్ (Dharna Chowk) వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో విజయవాడలో పలుచోట్ల నిరసనలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి.
ధర్నా చౌక్‌కు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
సచివాలయ ఉద్యోగులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు విజయవాడకు చేరుకున్నారు. అయితే ధర్నా చౌక్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా, ర్యాలీకి ముందస్తు అనుమతి లేదని పోలీసులు తేల్చారు. పోలీసులు అడ్డుకున్న ప్రాంతాల్లోనే ఉద్యోగులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొన్నిచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు పలువురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు.
ఉద్యోగులు, పోలీసుల మధ్య తోపులాట
ఉద్యోగులను అక్కడి నుంచి తరలించే క్రమంలో పలుచోట్ల పోలీసులు, ఉద్యోగుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. మహిళా ఉద్యోగులను కూడా పోలీసులు వాహనాల్లోకి ఎక్కించిన దృశ్యాలు కనిపించాయి. కొందరు ఉద్యోగులు (Employees) అస్వస్థతకు గురయ్యారు.
తమ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు వచ్చిన ఉద్యోగులను ఇలా అడ్డుకోవడం ఏమిటని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ప్రశ్నించారు. శాంతియుతంగా తమ సమస్యలను తెలియజేయడానికి వచ్చిన తమను అదుపులోకి తీసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఏళ్లుగా పనిచేస్తున్న ఉద్యోగులు (Employees) పలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ముఖ్యంగా నోషనల్ ఇంక్రిమెంట్లు(Notional Increments), పెండింగ్ వేతనాలు (Pending Salaries), ప్రమోషన్లు, మృతిచెందిన ఉద్యోగుల కుటుంబాలకు అందాల్సిన ప్రయోజనాలు, జీఓ నంబర్ 11 అమలు తదితర అంశాలపై స్పష్టత కోరుతున్నారు. ఈ సమస్యలపై ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు విజయవాడకు వచ్చిన సమయంలో పోలీసుల ఆంక్షలు విధించడంపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యోగ సంఘం అధ్యక్షుడిపై చర్యలు
ఇదే సమయంలో ఉద్యోగ సంఘం (Employees’ Association) అధ్యక్షుడిపై సస్పెన్షన్ (Suspension) చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామం ఉద్యోగుల్లో మరింత చర్చకు దారితీసింది. ఉద్యోగుల సమస్యలపై సంఘం తరఫున ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న సమయంలో ఇటువంటి చర్యలు తీసుకోవడం పట్ల ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్యోగుల ఆందోళనతో విజయవాడలో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. తమ హక్కులు, సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఉద్యోగులతో ప్రభుత్వం ఇలా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. చర్చలు జరిపి పరిష్కారం చూపాల్సింది పోయి అడ్డుకోవడం తగదని ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులపై జరిగిన తోపులాట(Scuffle), అరెస్టులు(Arrests), మహిళా ఉద్యోగుల (Women Employees) పట్ల వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇకనైనా ప్రభుత్వం ఉద్యోగుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.









