భారతరత్న, కర్ణాటక సంగీత దిగ్గజం ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత చరిత్ర వెండితెరపై ఆవిష్కృతం కానుంది. ‘M.S. A Legacy On Screen’ పేరుతో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక బయోపిక్ ప్రారంభోత్సవం చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి లోకనాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి తొలి క్లాప్ ఇచ్చారు.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండటంతో ఈ సినిమాపై సినీ, సంగీత వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడిన కమల్ హాసన్.. కోట్లాది మంది హృదయాలను తన గానంతో కదిలించిన సుబ్బులక్ష్మి జీవితాన్ని సినిమాగా తీసుకురావడం గొప్ప విషయమని అన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో భాగం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి చిత్రాలతో భావోద్వేగభరిత కథలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్కు దర్శకత్వం వహిస్తున్నారు. సుబ్బులక్ష్మి బాల్యం, సంగీత ప్రస్థానం, జాతీయ-అంతర్జాతీయ గుర్తింపు, వ్యక్తిగత జీవితంలోని కీలక ఘట్టాలను ఈ సినిమాలో ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.
సుబ్బులక్ష్మి పాత్రలో నటిస్తున్న రష్మికను కమల్ హాసన్ అభినందిస్తూ, ఇంతటి లెజెండరీ పాత్రను పోషించడం సవాల్‌తో కూడుకున్నదని అన్నారు. గీతా ఆర్ట్స్, రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ బయోపిక్‌లో రష్మిక సరికొత్త లుక్‌లో కనిపించనుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.








