భారత్-భూటాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భూటాన్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా బూమ్తాంగ్లోని నేషనల్ క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్‌ను సందర్శించిన ఆయన.. భారత్ తరఫున భూటాన్‌కు 43 స్వచ్ఛమైన జెర్సీ జాతి ఆవులను అందజేశారు. భూటాన్‌లో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు స్థానిక రైతులకు మద్దతు అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. దీని ద్వారా సుమారు 40 వేల మంది రైతులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందన్నారు.
అనంతరం జైశంకర్ చారిత్రక వాంగదుయెచోలింగ్ ప్యాలెస్ అండ్ మ్యూజియంను సందర్శించారు. భూటాన్ చరిత్ర, కళలు, హస్తకళలు, వాస్తుశిల్పానికి సంబంధించిన విశేషాలను ఆయన పరిశీలించారు. అలాగే పవిత్ర కుర్జే ల్హాఖాంగ్ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. భారత్-భూటాన్ ప్రజల సంక్షేమంతో పాటు రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
భూటాన్ విదేశాంగ మంత్రి ల్యోన్పో డీఎన్ ధుంగ్యెల్‌తో జైశంకర్ కీలక చర్చలు జరిపారు. అభివృద్ధి భాగస్వామ్యం, ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, ఆరోగ్యం, సంస్కృతి తదితర అంశాలపై ఇరువురు చర్చించారు. అనంతరం మౌలిక వసతులు, ఇంధనం, ఆరోగ్య రంగాలకు సంబంధించిన పలు ద్వైపాక్షిక ప్రాజెక్టులను ప్రారంభించారు. సెప్టెంబర్ 16, 17 తేదీల్లో కొనసాగుతున్న జైశంకర్ పర్యటనలో భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ టోబ్గేతో కూడా సమావేశాలు జరగనున్నాయి.








