అనంతపురం జిల్లా రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్ అలియాస్ దుమ్ముపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడి కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో పోలీసుల కాల్పులపై సీబీఐతో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపీకృష్ణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తొలగించిన కాలును భద్రపరచాలని కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా వేశారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం.. హేమంత్‌కు తొలగించిన కాలును భద్రపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, పోలీసులను ఆదేశించింది.
తొలగించిన కాలుకు నిబంధనల ప్రకారం ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రత్యేక ప్రభుత్వ న్యాయవాది ఎస్. ప్రణతి కోర్టుకు తెలిపారు. అలాగే, పిటిషన్‌లో విద్యాశాఖ అధికారులను ప్రతివాదులుగా చేర్చాలన్న అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను డిసెంబర్ 30కి వాయిదా వేసింది.








