“నీట్ పరీక్ష కాదు.. అదొక వేలం పాట” – మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్‌

"నీట్ పరీక్ష కాదు.. అదొక వేలం పాట" - మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఫైర్‌

దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ (NEET) 2026 పరీక్ష రద్దు కావడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని, వారి కలలను బీజేపీ (BJP) ప్రభుత్వం కాలరాసిందని ధ్వజమెత్తారు. మే 3న జరిగిన పరీక్షలో పేపర్ లీక్ (Paper Leak) కారణంగా ప్రభుత్వం రద్దు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, ఆయన ఎక్స్ (X) వేదికగా కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

పేపర్ లీక్ మాఫియాదే రాజ్యం
“నీట్ అనేది ఇప్పుడు ఒక పరీక్షగా మిగలలేదు.. అది ఒక వేలం పాటగా (Auction) మారిపోయింది” అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. “లక్షలాది మంది విద్యార్థులు (Students) రాత్రంతా మేల్కొని, కళ్లలో ఒత్తులు వేసుకుని చదువుకున్నారు. కానీ వారికి ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం మాత్రం ‘పేపర్ లీకులు’. దీనివల్ల నిజాయితీగా చదివే విద్యార్థులు శిక్ష అనుభవిస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లల చదువు కోసం తండ్రులు అప్పులు తెచ్చారని, తల్లులు తమ నగలను అమ్ముకున్నారని గుర్తు చేస్తూ.. ఆ కుటుంబాల ఆర్థిక భారాన్ని, మానసిక వేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి (Corruption) చోటుచేసుకుంటోందని రాహుల్ ఆరోపించారు.

“ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. దేశ యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరం. కాగితపు మాఫియా (Paper Mafia) ప్రతిసారీ తప్పించుకుంటోంది. ప్రధాని మోదీ చెబుతున్న ‘అమృత్ కాలం’ (Amrit Kaal) దేశానికి ‘విష యుగం’గా మారింది” అని ఆయన ఘాటుగా విమర్శించారు.

ఒక విద్యార్థి తలరాతను వారి కష్టం నిర్ణయించకుండా.. డబ్బు, పలుకుబడి, రాజకీయ సంబంధాలు నిర్ణయిస్తుంటే ఇక చదువుకు అర్థం ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు. లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం(Financial Pressure), అనిశ్చితిని భరించాల్సి రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మొత్తానికి, నీట్ పరీక్ష రద్దు వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ప్రతిపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తుండగా, పారదర్శకత కోసమే రద్దు నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment