రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం తెల్లవారుజామున న్యూఢిల్లీలో అడుగుపెట్టారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన 18వ BRICS శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అలాగే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. న్యూఢిల్లీ చేరుకున్న పుతిన్‌కు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధనం, సాంకేతికత తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది.
2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా వెలుపల జరిగే BRICS శిఖరాగ్ర సదస్సుకు పుతిన్ ప్రత్యక్షంగా హాజరవడం ఇదే తొలిసారి. దీంతో ఆయన భారత్ పర్యటనకు అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. BRICS సమావేశాల్లో సభ్య దేశాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, అభివృద్ధి, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చలు జరగనున్నాయి. అదే సమయంలో మోదీ–పుతిన్ భేటీపై కూడా ప్రత్యేక ఆసక్తి నెలకొంది. భారత్–రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది.








