కడప జిల్లా కొండాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో జనవరి 14న జరిగిన ఓ ఘర్షణ కేసులో పోలీసుల దర్యాప్తు, అరెస్టుల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే ఘటనలో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులు గాయపడినప్పటికీ.. ఒక వర్గానికి 41ఏ నోటీసులు ఇచ్చి పోలీస్‌స్టేషన్ బెయిల్‌పై విడుదల చేసి, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి, వారిలో ఐదుగురిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించడంపై కమిషన్ ప్రశ్నలు సంధించింది.
ఈ వ్యవహారంపై విచారణ సందర్భంగా కడప డీఎస్పీ మురళీ నాయక్‌పై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జుటోత్ హుస్సేన్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
జనవరి 14న కొండాపురం పీఎస్ పరిధిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందినవారికి గాయాలయ్యాయి. అయితే పోలీసులు ఒక వర్గానికి చెందిన వారిపై కేవలం 41ఏ నోటీసులు జారీ చేసి పోలీస్‌స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారని, అదే సమయంలో ఎస్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిపై కేసులు నమోదు చేశారు. వారిలో ఐదుగురిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 9వ నిందితుడిగా ఉన్న డేరా శేఖర్‌ను ఏప్రిల్ 28న అక్రమంగా అరెస్టు చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.
గాయపడిన ఎస్టీలను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిన పోలీసులు.. అదే ఘటనలో మరో వర్గానికి చెందిన వారిని ఎందుకు అరెస్టు చేయలేదని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుపై హైదరాబాద్‌లో జరిగిన విచారణకు జిల్లా ఎస్పీ హాజరుకాకపోవడంపై కూడా జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎస్పీ తరఫున వివరణ ఇవ్వడానికి డీఎస్పీ మురళీ నాయక్ హాజరుకాగా.. ‘ఎస్పీ ఎందుకు హాజరు కాలేదు? నువ్వెందుకు వచ్చావు?’ అంటూ కమిషన్ ప్రశ్నించింది.
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జుటోత్ హుస్సేన్ నాయక్ పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘మాకు సోది చెప్పకండి.. ఎస్పీ ఎందుకు హాజరు కాలేదు? చట్టం ముందు ఎవరైనా సమానులే’’ అంటూ నిలదీశారని బాధిత వర్గాలు తెలిపాయి. కేసు దర్యాప్తులో పోలీసుల వ్యవహారశైలిపై కమిషన్ సభ్యుడు పలు ప్రశ్నలు సంధించారు. ముఖ్యంగా గాయపడిన ఎస్టీలపై కేసులు నమోదు చేయడం, వారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేయడం వంటి అంశాలను కమిషన్ తీవ్రంగా పరిగణించింది.
జాతీయ ఎస్టీ కమిషన్ విచారణ నేపథ్యంలో కొండాపురం కేసు మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒకే ఘటనలో ఇరువర్గాలపై వేర్వేరు చర్యలు తీసుకున్నారన్న ఆరోపణలపై కమిషన్ తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.








