ఐపీఎల్‌లో(IPL) అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కొత్త హెడ్ కోచ్ (Head Coach) ఎంపికపై కసరత్తు చేస్తోంది. సీఎస్‌కేతో సుదీర్ఘకాలం కోచ్‌గా పనిచేసిన స్టీఫెన్ ఫ్లెమింగ్(Stephen Fleming) బాధ్యతల నుంచి తప్పుకోవడంతో తదుపరి కోచ్ ఎవరనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ బ్యాటర్, అనుభవజ్ఞుడైన కోచ్ హేమంగ్ బదానీ (Hemang Badani) పేరు ప్రధానంగా వినిపిస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni), ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad), జట్టు మేనేజ్‌మెంట్ కలిసి కొత్త కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా సపోర్ట్ స్టాఫ్‌కు భారతీయుల నాయకత్వం ఉండాలని ధోనీ సూచించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే బదానీకి అవకాశాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఐపీఎల్‌తో పాటు విదేశీ టీ20 లీగ్‌లలోనూ కోచింగ్ అనుభవం ఉండటం ఆయనకు అదనపు బలంగా మారింది.
కొత్త హెడ్ కోచ్ సీఎస్‌కేపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ధోనీ మరో కీలక ప్రతిపాదన చేసినట్లు సమాచారం. ఒకేసారి పలు టీ20 ఫ్రాంచైజీలకు కోచింగ్ బాధ్యతలు నిర్వహించే విధానానికి ముగింపు పలకాలని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. గతంలో స్టీఫెన్ ఫ్లెమింగ్ సీఎస్‌కేతో పాటు ఇతర సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు కూడా కోచ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అయితే ఇకపై సీఎస్‌కే హెడ్ కోచ్‌కు ఇతర ఫ్రాంచైజీల బాధ్యతలు ఉండకూడదనే ఆలోచన తెరపైకి వచ్చింది. 2023లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీఎస్‌కే.. ఆ తర్వాత వరుసగా నిరాశపరుస్తోంది. 2026 సీజన్‌లోనూ ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకోవడంతో పాటు గత మూడు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు దూరమైంది. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ ఎంపిక సీఎస్‌కే భవిష్యత్ ప్రణాళికల్లో కీలకంగా మారనుంది. ప్రస్తుతం హేమంగ్ బదానీ రేసులో ముందంజలో ఉన్నట్లు సమాచారం.








