రష్యా అధ్యక్షుడు (Russian President)వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత్ (India) పర్యటన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై కీలక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భారత్ ముందు రష్యా పలు ప్రతిపాదనలు ఉంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా Su-57 ఐదో తరం ఫైటర్ జెట్లను (Su-57 Fifth-Generation Fighter Jets) భారత్‌లోనే సంయుక్తంగా తయారు చేయడం, భారత వైమానిక దళంలోని Su-30MKI విమానాలను ‘సూపర్ సుఖోయ్’ ప్రమాణాలకు (Super Sukhoi Standards) అప్‌గ్రేడ్ చేయడం, S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను (S-500 Air Defence System) పరిశీలించడం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
భారత వైమానిక దళంలో(Indian Air Force) ఉన్న సుమారు 260 Su-30MKI విమానాలను ఆధునీకరించే ‘సూపర్ సుఖోయ్’ కార్యక్రమం విలువ 11 బిలియన్ డాలర్లకు పైగా ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో కొత్త AESA రాడార్(AESA Radar), ఆధునిక ఏవియానిక్స్(Advanced Avionics), మెరుగైన ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సామర్థ్యాలు, ఇంజిన్లు, ఆధునిక ఆయుధ వ్యవస్థల అనుసంధానం వంటి మార్పులు ఉండే అవకాశం ఉంది. అలాగే భారత్ ఇప్పటికే వినియోగిస్తున్న S-400 వ్యవస్థల నిర్వహణ, మరమ్మతుల కోసం దేశంలోనే MRO సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని రష్యా ప్రతిపాదించినట్లు సమాచారం.
ఇక S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు Pantsir-S1M, ఆధునిక రాడార్లు, వ్యూహాత్మక సబ్‌మెరైన్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా రష్యా నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే Su-57, S-500 వంటి వ్యవస్థల కొనుగోలు విషయంలో భారత్ తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం లేదు. సాంకేతికత బదిలీ, దేశీయ తయారీ, ఖర్చు, నిర్వహణ, పనితీరు వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే భారత్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.








