కేసుల పేరుతో ఏపీ పోలీసులు నటుడు పోసాని కృష్ణమురళిని రాష్ట్ర వ్యాప్తంగా వేల కిలోమీటర్లు తిప్పుతున్న విషయం తెలిసిందే. అన్ని కేసుల్లోనూ బెయిల్ పొందిన పోసాని నిన్న అరెస్టు అవుతారని అంతా భావించిన తరుణంలో అనూహ్యంగా సీఐడీ రంగ ప్రవేశంచేసింది. పోసాని సోషల్ మీడియా పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు చేసింది.
ఇదిలా ఉండగా, సీఐడీ పోలీసులు పోసానిని బుధవారం రాత్రి గుంటూరులో ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ ఎదుట పోసాని కృష్ణమురళి కన్నీరు పెట్టుకున్నారు. అరెస్టు విషయంపై ఆవేదన వ్యక్తం చేశారు. తనను నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలోకి రమ్మన్నారని, తాను రాను అని చెప్పడంతో కేసులు పెట్టి వేధిస్తున్నాడని పోసాని వాపోయారు. కావాలంటే తనకు నార్కో ఎనాలసిస్ టెస్ట్ చేయండి అంటూ సూచించారు.
”సోషల్ మీడియా పోస్టులు పెడితే ఇన్ని కేసులు కడతారా..? నామీద ఎన్ని కేసులు కట్టారో నాకే తెలియదు. నన్ను రాష్ట్రమంతా తిప్పుతున్నారు. వయసు మీదపడడంతో కూర్చోలేక పోతున్నాను. పోలీసులు ఎక్కడినుంచి ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియడం లేదు. నంది అవార్డుల ప్రకటనలో పక్షపాతాన్ని ఎత్తిచూపడంతో కక్ష కట్టారు. నేను తప్పు చేసి ఉంటే నన్ను నరికేయండి. రెండు రోజుల్లో నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్యే నాకు శరణ్యం” అని మేజిస్ట్రేట్ ఎదుట న్యాయవాదులతో ఆవేదన చెబుతూ పోసాని కృష్ణమురళి బోరున విలపించారు.








