ఉన్నతాధికారుల ఇళ్లల్లో వెట్టిచాకిరీ చేయడానికి నిరాకరించినందుకు ఒక మహిళా హోంగార్డుపై వేధింపులకు పాల్పడటమే కాకుండా, చివరికి ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన దారుణ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గ పరిధిలో వెలుగుచూసింది. న్యాయం చేయాల్సిన జిల్లా ఎస్పీ కూడా తనను అవహేళన చేశారని సదరు మహిళా హోంగార్డు ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్న సంఘటన పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న రూపకళకు భర్త చనిపోవడంతో జీవనాధారం కోసం ప్రభుత్వం హోంగార్డు ఉద్యోగం ఇచ్చింది. అయితే, కొద్దిరోజులుగా ఒక పోలీస్ ఉన్నతాధికారి ఇంట్లో ఇంటిపనులు చేయాలని ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని పేర్కొంది.
తన ఆరోగ్యం సహకరించడం లేదని, తాను పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించేందుకే వచ్చానని, ఇళ్లల్లో పనులు చేయలేనని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన అధికారులు ఆమెకు శిక్ష (పనిష్మెంట్) కింద వారం రోజుల పాటు జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపించారు. అక్కడ ప్రతిరోజూ ఆమెతో ఆవరణలోని గడ్డి పీకించి మానసికంగా వేధించినట్లు ఆమె వాపోయారు.
తనకు జరుగుతున్న అన్యాయం, కష్టాలు విన్నవించుకునేందుకు రూపకళ జిల్లా ఎస్పీని కలిశారు. అయితే, ఎస్పీ కూడా తన బాధను వినకపోగా చాలా దురుసుగా మాట్లాడారని ఆమె ఆరోపించారు. “మీకు ఉద్యోగాలు ఇచ్చింది పోలీస్ స్టేషన్లలో కూర్చోవడానికి కాదు.. ఉన్నతాధికారుల ఇళ్లల్లో పనిచేయడానికే” అని ఎస్పీ తనను ఉద్దేశించి అవహేళనగా మాట్లాడారని రూపకళ కన్నీటి పర్యంతమయ్యారు. తన గోడును ఎవరూ పట్టించుకోకపోగా, చివరకు రూపకళను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పే అధికారులు, తమ కింద పనిచేసే సిబ్బందిని మాత్రం బానిసలుగా చూస్తున్నారని హోంగార్డు రూపకళ ఆవేదనతో అర్థమైంది. ఈ ఘటనపై ప్రజాసంఘాలు, మానవ హక్కుల నాయకులు మండిపడుతున్నారు. భర్తను కోల్పోయి, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక మహిళా హోంగార్డుపై ఇలాంటి వేధింపులకు పాల్పడి సస్పెండ్ చేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణమే ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, రూపకళకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పెనమలూరు పీఎస్ మహిళా హోంగార్డ్ ఆవేదన
— Telugu Feed (@Telugufeedsite) August 6, 2026
పోలీసు ఉన్నతాధికారి ఇంట్లో పని చేయాలని ఒత్తిడి.. నిరాకరించిన మహిళా హోంగార్డు
మహిళా హోంగార్డును పనిష్మెంట్ కింద వారం రోజులు ఎస్పీ కార్యాలయానికి పంపిన పోలీసులు
ఎస్పీ కార్యాలయంలో రోజు గడ్డి పీకించారంటూ ఆవేదన
తన గోడు వినిపించుకునేందుకు… pic.twitter.com/XsZMBmMsEC







