తిరుప‌తిలో టీడీపీ నేత‌ల‌ దౌర్జన్యం.. మీడియాపై దాడి

తిరుప‌తిలో టీడీపీ నేత‌ల‌ దౌర్జన్యం.. మీడియాపై దాడి

Summarize with AI

తిరుపతిలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల తీరు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తన భర్త హత్య కేసులోని నిందితులకు తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాస్ అండగా నిలుస్తున్నారని ఆరోపిస్తూ ఆయన ఇంటి ఎదుట నిర‌స‌న చేప‌ట్టిన బాధితురాలితో పాటు, నిరసనను కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరులపై టీడీపీ నాయకులు, అనుచరులు తీవ్రస్థాయిలో దాడికి దిగారు. సామాన్యులతో పాటు జర్నలిస్టులపై కూడా ప్రత్యక్ష దాడులకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కొంతకాలం క్రితం దారుణ హత్యకు గురైన పసుపులేటి మురళి (బెల్ట్ మురళి) భార్య సత్య, తన భర్త హత్య కేసులో ఉన్న నిందితులకు టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ రక్షణ కల్పిస్తున్నారని మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె జేబీ శ్రీనివాస్ ఇంటి ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బాధితురాలు సత్యపై జేబీ శ్రీనివాస్ అనుచరులు తీవ్ర దౌర్జన్యానికి దిగడమే కాకుండా, అక్కడికి కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా విరుచుకుపడ్డారు.

వార్త సేకరణకు వెళ్లిన స్థానిక ఛానెల్ రిపోర్టర్ సునీల్ ను పట్టుకుని జేబీ శ్రీనివాస్ ఇంటి లోపలికి లాక్కెళ్లారు. అక్కడ ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసి, బలవంతంగా చొక్కా మార్పించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వార్తను చిత్రీకరిస్తున్న సాక్షి కెమెరామెన్ మోహన్ కృష్ణ రాయల్ పై కూడా జేబీ శ్రీనివాస్ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. జేబీ శ్రీనివాస్ ఇంట్లో బంధించి కొడుతున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని, రిపోర్టర్ సునీల్‌ను బయటకు తీసుకురావాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

నడిరోడ్డుపై, అందరి సమక్షంలోనే జర్నలిస్టులు, మహిళపై టీడీపీ, జనసేన శ్రేణులు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. “బాధితులకు న్యాయం చేయమని అడిగితే దాడులు చేస్తారా? ప్రశ్నించే మీడియా ప్రతినిధులను ఇంట్లో బంధించి కొట్టే సంస్కృతి ఎక్కడిది? రాష్ట్రంలో బీహార్‌ను మించిన అరాచక పరిస్థితులు దాపురించాయి” అని స్థానిక ప్రజలు, జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్య‌క్తం చేస్తున్నాయి.

శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన అధికారులు దాడులు చేసిన వారిపై ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అధికార పార్టీ నేతలు మరింత రెచ్చిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టులపై దాడి చేసిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని విలేకరుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment