‘దిశ బిల్లు’ రద్దు.. చంద్ర‌బాబు కేబినెట్ నిర్ణయంపై వివాదం!

'దిశ బిల్లు' రద్దు.. చంద్ర‌బాబు కేబినెట్ నిర్ణయంపై వివాదం!

Summarize with AI

మహిళల భద్రత (Women Safety) కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లును (Disha Bill) రద్దు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని రాష్ట్ర మంత్రిమండలి (State Cabinet) తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం తీవ్ర వివాదాస్పదంగా మారింది. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో(Telangana) జరిగిన దారుణ ఘటన.. త‌న రాష్ట్రంలో పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో వైసీపీ(YSRCP) హ‌యాంలో నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్‌ (YS Jagan) ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థను ఉన్నపలంగా రద్దు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు, మహిళా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ర‌ద్దుకు కేంద్రం పేరును సాకుగా చూప‌డాన్ని త‌ప్పుబ‌డుతున్నారు.

రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విలేకరులతో మాట్లాడుతూ.. 2019 నాటి దిశ బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. దేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన భారతీయా న్యాయ సంహిత (BNS) చట్టాలు సరిపోతాయని, అందుకే ప్రత్యేకంగా దిశ చట్టం అవసరం లేదని కేబినెట్ భావించినట్లు తెలిపారు. 15 రోజుల్లో విచార‌ణ పూర్తిచేయాల‌ని, మహిళలను వేధించే నేరస్థులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా గతంలో తీసుకొచ్చిన నిబంధనల ప‌ట్ల ఆమె చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

భరోసానిచ్చిన ‘దిశ’ వ్యవస్థ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మహిళలు ధైర్యంగా, నిశ్చింతగా తిరిగేలా దిశ యాప్‌తో పాటు విస్తృతమైన రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. గత ఐదేళ్లలో ఈ వ్యవస్థ సాధించిన పురోగతిని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో గుర్తుచేస్తున్నారు.

రాష్ట్రంలో ఏకంగా 1.51 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను తమ ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకుని రక్షణ కవచంగా భావించారు. యాప్ ద్వారా అందిన ఎస్‌ఓఎస్ (SOS) కాల్స్‌కు స్పందించి దాదాపు 31,607 మంది మహిళలకు పోలీసులు సత్వర రక్షణ కల్పించారు.

మహిళలపై నేరాల విచారణకు ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడమే కాక, మరొక 8 స్టేషన్ల ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. దీనికి తోడు 13 పోక్సో (POCSO) కోర్టులు, 12 ప్రత్యేక మహిళా కోర్టులను అందుబాటులోకి తెచ్చారు.

ఆధారాలు వేగంగా సేకరించేందుకు అనంతపురం, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, విజయవాడలలో ప్రత్యేక ఫోరెన్సిక్ బస్సులు, విశాఖ-తిరుపతిలలో రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలను(Regional Forensic Science Laboratories) నిర్మించారు. ఫలితంగా 86 పోక్సో కేసుల్లో నేరస్థులకు వేగంగా శిక్షలు పడ్డాయి.

మహిళలకు ఎంతో ఉపయోగపడిన, విపత్తు సమయంలో రక్షణగా నిలిచిన ఒక మంచి కార్యక్రమాన్ని ర‌ద్దు చేయ‌డంపై విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. కేంద్రం ప్ర‌భుత్వం అడిగిన స‌వ‌ర‌ణ‌ల‌కు స‌రైన రిప్లై ఇవ్వ‌లేద‌ని, ఇప్పుడున్న బీఎన్ఎస్(BRS) స‌రిపోతుంద‌ని మంత్రులు అందులోనూ స్వ‌యాన మ‌హిళా హోంమంత్రి మాట్లాడ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేవలం గత ప్రభుత్వం తెచ్చిందనే నెపంతో రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

“మహిళల భద్రత కోసం అత్యవసర సమయంలో ఉపయోగపడే ఒక మంచి యాప్‌ను, దానికి సంబంధించిన పోలీస్ వ్యవస్థను బలహీనపరచడం దారుణం. కేంద్ర చట్టాల పేరు చెప్పి రాష్ట్రంలో పటిష్టంగా ఉన్న భద్రతా వ్యవస్థను ఎత్తివేయడం అంటే మహిళా రక్షణను గాలికి వదిలేయడమే.” అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కేంద్ర చట్టాలు ఉన్నప్పటికీ, అత్యవసర సమయాల్లో క్షణాల వ్యవధిలో పోలీసులను సంఘటనా స్థలానికి రప్పించే ‘దిశ’ వంటి సాంకేతిక వ్యవస్థను ఎత్తివేయడం వల్ల మహిళల రక్షణ ప్రశ్నార్థకంగా మారుతుందని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం పునరాలోచించుకోవాలని తీవ్రస్థాయిలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment