దాదాపు రెండేళ్ల తర్వాత మాజీ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా బహిరంగంగా స్పందించారు. న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియా నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఆమె, ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 2024లో విద్యార్థుల ఉద్యమం అనంతరం బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చిన హసీనా, అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అరాచక పరిస్థితులు నెలకొన్నాయని, తాము నిర్మించిన దేశం ఇప్పుడు పూర్తిగా మారిపోయిందని వ్యాఖ్యానించారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి పథకం ప్రకారమే కుట్ర జరిగిందని, అది సహజ విద్యార్థి ఉద్యమం కాదని, పాలనను మార్చేందుకు జరిగిన “రెజీమ్ చేంజ్” ఆపరేషన్ అని ఆరోపించారు.
అల్లర్ల సమయంలో పోలీసులపై భారీ దాడులు జరిగాయని, వేలాది మంది పోలీసు సిబ్బంది మరణించారని లేదా గాయపడ్డారని, వందలాది పోలీస్ స్టేషన్లు ధ్వంసమయ్యాయని షేక్ హసీనా పేర్కొన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మహ్మద్ యూనస్ ప్రభుత్వం జైలులో ఉన్న నేరస్తులకు క్షమాభిక్షలు ఇచ్చిందని, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతిందని విమర్శించారు. తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షసాధింపులో భాగమేనని పేర్కొంటూ, త్వరలోనే తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి ప్రజల మధ్య ఉంటానని ప్రకటించారు.
అయితే హసీనా వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఆమెను “దోషిగా తేలిన నరహంతకురాలు”, “సామూహిక హత్యలకు పాల్పడిన నేరస్తురాలు”గా అభివర్ణిస్తూ, అలాంటి వ్యక్తికి భారత భూభాగం నుంచి మీడియాతో మాట్లాడే అవకాశం కల్పించడం తమ దేశ సార్వభౌమత్వాన్ని అవమానించడమేనని ఆరోపించింది. అంతేకాకుండా, ఐక్యరాజ్యసమితి నమోదు చేసిన మరణాల వివరాలను హసీనా ప్రశ్నించడం చరిత్రను వక్రీకరించే ప్రయత్నమని పేర్కొంది. 2013లో కుదిరిన నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను తమకు అప్పగించాలని ఇప్పటికే భారత్‌ను కోరామని, ఇప్పటికీ స్పందన రాలేదని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ వెల్లడించింది.







