ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడలో జనసేన యువజన విభాగం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గత 10 రోజులుగా కేరళంలో ప్రస్తుతం ఆయుర్వేద ప్రకృతి వైద్యం పొందుతున్న పవన్ కళ్యాణ్.. కేరళం నుంచి ప్రత్యేక ఆడియో సందేశాన్ని పంపించారు. తనకు దేశం కోసం పనిచేసే చేతులు కావాలంటూ పవన్ పంపించిన సందేశాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ వినిపించారు.
‘‘నేను ఎక్కడ ఉన్నాననే ప్రశ్నార్థకం వద్దు.. ఇక్కడే ఉన్నాననే అస్తిత్వ పిడికిలి కావాలి’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. దేనికోసం చేతులు చాచొద్దని, దేశం కోసం పనిచేసే చేతులు కావాలని పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు నాయకులు, పార్టీ కోసం జిందాబాద్ కొట్టామని పేర్కొన్న పవన్.. ఇకపై యువత భవిత, మార్పు, తీర్పు కోసం జై కొట్టాలని సూచించారు. పట్టు వదలని జనం కోసం పోరాడే సేన కోసం జై కొట్టాలని పవన్ కల్యాణ్ అన్నారు. యువత కేవలం రాజకీయ నినాదాలకే పరిమితం కాకుండా సమాజం, దేశం కోసం పనిచేసే దిశగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
అయితే పవన్ వ్యాఖ్యలపై నెట్టింట సెటైర్లు పేలుతున్నాయి. జనసేన యువజన విభాగం ఆవిష్కరణ సందర్భంగా పవన్ పంపిన ఈ ఆడియో సందేశం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకెత్తించగా, మరో వైపు దేశం అంటే తెలుగుదేశమేనా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు జనసేన కార్యకర్తలు టీడీపీ జెండా మోయాలని సెటైర్లు వేస్తున్నారు. సొంతం, ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను నిలిపే ధైర్యం ఉందా..? అని ప్రశ్నిస్తున్నారు.








