తెలంగాణలో(Telangana) అధికార కాంగ్రెస్ పార్టీలో(Congress Party) అసమ్మతి నేతల స్వరం పెరుగుతోంది. రాష్ట్రంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అంశం హాట్ టాపిక్‌గా నడుస్తున్న వేళ.. మరో కీలక నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) మరోసారి తన అసమ్మతి రాగాన్ని వినిపించారు. పార్టీలోని వలస నేతలు, కేబినెట్ మంత్రులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో పెద్ద దుమారం రేపుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీ చేరిన తరుణంలో కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ అంతర్గత విభేదాలను మరోసారి బట్టబయలైనట్లైంది.
‘కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఉన్న అసలైన నేతలను పక్కనబెడుతున్నారు. వేరే పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన కొందరు నేతలు పార్టీని కబ్జా చేస్తున్నారు. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్నే వెళ్లగొట్టాలని చూస్తున్నారు అంటూ పరోక్షంగా కేబినెట్‌లోని కీలక నేతలను, పార్టీలోని వలస నేతలను లక్ష్యంగా చేసుకుని ధ్వజమెత్తారు.
తనకు పదవుల పట్ల ఆశ లేదని చెప్తూనే, సమయం వచ్చినప్పుడు పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కచ్చితంగా ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్టిస్తానని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు తనకు మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చిందని, అయితే ఆ హామీ నెరవేరకపోవడంపై ఆయన తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది.
పదవుల కంటే రాజకీయాల్లో, ప్రభుత్వ వ్యవస్థల్లో మార్పు రావడం ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పేద ప్రజల సమస్యలను పక్కనబెట్టి సొంత ప్రయోజనాల కోసం పనిచేసే సంస్కృతి మారాలని, అభివృద్ధి పనులు నిలిచిపోవడంపై తాను గళం విప్పుతూనే ఉంటానని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.








