పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సీరియస్‌గా స్పందించారు. ఇటీవల డీఎస్పీపై పేకాట శిబిరాలకు అండగా ఉన్నారని, సివిల్ వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేర్లు ఉపయోగిస్తున్నారనే పలు ఫిర్యాదులు ఉప ముఖ్యమంత్రికి అందాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి, డీఎస్పీ ప్రవర్తనపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “అసాంఘిక కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటం అసహ్యం. పోలీసు విభాగం సివిల్ వివాదాల్లో తలదూర్చకూడదు” అని స్పష్టం చేశారు. భీమవరం పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలందరినీ సమదృష్టితో చూడాలి అని ఎస్పీకి దిశానిర్దేశం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలను సహించదని, ఈ తరహా వ్యవహారాలపై కఠిన చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అదేవిధంగా, భీమవరం డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను రాష్ట్ర హోం శాఖ మంత్రి, డీజీపీకి తెలియజేయాలని తన కార్యాలయ అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. “ప్రజా సేవే పోలీసు శాఖ ధర్మం, వ్యక్తిగత ప్రయోజనాలు లేదా రాజకీయ ప్రభావం ఉండకూడదు” అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.








