గతేడాది సరిహద్దుల్లో ఉగ్రవాద స్థావరాలను తుడిచిపెట్టేందుకు భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) లో వీరమరణం పొందిన అమర జవాన్ల వివరాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ ఆపరేషన్‌లో ఆరుగురు భారతీయ సైనికులు వీరమరణం పొందగా, వారి త్యాగాలను స్మరిస్తూ నేషనల్ వార్ మెమోరియల్ (National War Memorial) అధికారిక వెబ్సైట్లో పేర్లను వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్న ‘త్యాగ్ చక్ర’(Tyag Chakra) గ్రానైట్ శిలాఫలకాలపై వీరి పేర్లను శాశ్వతంగా లిఖించనున్నారు.
ఆపరేషన్ సిందూర్‌లో ప్రాణాలు అర్పించిన ఆరుగురు వీరులలో ఐదుగురు ఇండియన్ ఆర్మీకి చెందినవారు కాగా, ఒకరు భారత వైమానిక దళానికి (IAF) చెందిన సార్జెంట్(Sergeant).. అమరులైన జవాన్లలో సుబేదార్ మేజర్ పవన్ కుమార్ (Pawan Kumar) (10 ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్), రైఫిల్ మేన్ సునీల్ కుమార్ (Sunil Kumar) (జమ్మూ కశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీ 4వ బెటాలియన్), లాన్స్ నాయక్ దినేష్ కుమార్ (Dinesh Kumar) (5 ఫీల్డ్ రెజిమెంట్), హవల్దార్ సునీల్ కుమార్ సింగ్ (Sunil Kumar Singh) (237 ఫీల్డ్ వర్క్‌షాప్), సార్జెంట్ సురేంద్ర కుమార్ (Surendra Kumar) (ఎయిర్ ఫోర్స్ 39వ వింగ్), అగ్నివీర్ మురళీ నాయక్ (Murali Naik) (851 లైట్ రెజిమెంట్).
ఈ ఆపరేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) చెందిన అగ్నివీర్ మురళీ నాయక్ వీరమరణం పొందడం రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. మురళీ నాయక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) కళ్లితండాకు చెందినవారు. 2022లో అగ్నివీర్‌గా ఎంపికైన ఆయన, జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir) సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తూ ఆపరేషన్ సిందూర్ వేళ శత్రువులతో జరిగిన ఎదురుకాల్పుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించారు.
గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam) వద్ద అమాయక పర్యాటకులపై పాకిస్థాన్ (Pakistan)ముష్కరులు జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు మే 7వ తేదీన ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పాకిస్థాన్, పీఓకే (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించాయి. జైషే మహమ్మద్(Jaish-e-Mohammed), లష్కరే తొయిబా (Lashkar-e-Taiba) వంటి సంస్థల మౌలిక సదుపాయాలను ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ పోరాటంలోనే మన ఆరుగురు జవాన్లు వీరమరణం పొంది దేశ రక్షణలో అమరులయ్యారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కోవలోనే, ఇప్పుడు ఈ ఆరుగురు ఆపరేషన్ సిందూర్ యోధుల పేర్లు, వారి హోదాలు జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై చేరి దేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోనున్నాయి.








