ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా శాఖ (ఆర్టీసీ)ని(APSRTC) ప్రైవేటుపరం (Privatization) చేసేందుకు తెరవెనుక జరుగుతున్న ప్రయత్నాలపై ఉద్యోగ సంఘాలు (Employee Unions) సమరశంఖం పూరించాయి. ఆర్టీసీ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ (JAC) ఈనెల 28వ తేదీన అత్యంత కీలకమైన రాష్ట్రస్థాయి సమావేశాన్ని (State-Level Meeting) నిర్వహించనుంది. ఆర్టీసీని కాపాడుకునేందుకు, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు ఈ సమావేశంలో ‘రెండో దశ’ (Second Phase) ఉద్యమ (Agitation) భవిష్యత్ కార్యాచరణను అధికారికంగా ప్రకటించనున్నారు.
ఆర్టీసీ లాభదాయకమైన రూట్లలో ప్రైవేట్ విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులను (Electric Buses) ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సంస్థకు నష్టాలు తెచ్చేలా ప్రైవేట్ శక్తులను లోపలికి రానివ్వబోమని స్పష్టం చేస్తోంది. దీనితో పాటు, ఆర్టీసీకి చెందిన విలువైన డిపోలను(Depots), ల్యాండ్ బ్యాంక్‌లను (Land Banks), ఇతర ఆస్తులను పీపీపీ(PPP) విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రమోషన్లు, అలవెన్సులు, పీఆర్సీ (PRC) బకాయిలతో పాటు పలు సేవా నిబంధనలపై ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్నారు. వీటిపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన హామీలు ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రభుత్వం కేవలం ప్రైవేటీకరణపై చూపుతున్న శ్రద్ధను, సంస్థ పరిరక్షణపై, కార్మికుల సమస్యల పరిష్కారంపై చూపడం లేదని జేఏసీ(JAC) మండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే, ఈనెల 28న జరిగే రాష్ట్ర సమావేశంలో అన్ని జిల్లాల ప్రతినిధులతో చర్చించి, సమ్మెతో కూడిన ఉధృత పోరాట కార్యాచరణను ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.








