కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. బాబు ఆదేశాల‌కు లెక్కేదీ..?

కోనసీమలో మరోసారి గ్యాస్ లీక్.. బాబు ఆదేశాల‌కు లెక్కేదీ..?

Summarize with AI

అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజల ప్రాణాలను ఓఎన్‌జీసీ (ONGC) గ్యాస్ లీకేజీలు (Gas Leaks) నిత్యం అగ్నిగుండంలోకి నెడుతున్నాయి. పది నెలల క్రితం ఇరుసుమండలో (Irusumanda) జరిగిన ఘోర ప్రమాదాన్ని ప్రజలు ఇంకా మరువకముందే, తాజాగా మామిడికుదురు మండలంలో మరో భారీ గ్యాస్ లీక్ సంభవించడం తీవ్ర కలకలం రేపుతోంది.

గతంలో గ్యాస్ ప్రమాదాలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇచ్చిన ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయా? పది నెలల్లోనే మరోసారి ప్రమాదం జరగడం ప్రభుత్వ పర్యవేక్షణ వైఫల్యానికి నిదర్శనం కాదా? అని స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం గెద్దాడ–మామిడికుదురు (Geddada–Mamidikuduru) హైవేకు ఆనుకుని ఉన్న ONGC డ్రిల్లింగ్ రిగ్ (Drilling Rig) నుంచి మంగళవారం ఒక్కసారిగా భారీ ఎత్తున గ్యాస్ ఎగసిపడింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో గ్యాస్ లీక్ కావడంతో పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు.

ప్రమాద తీవ్రత దృష్ట్యా చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ లైట్లు (Lights) వేయకూడదని, విద్యుత్ పరికరాలు(Electrical Appliances), గ్యాస్ స్టవ్‌లు (Gas Stoves) వినియోగించకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

కోనసీమలో ఓఎన్‌జీసీ నిర్లక్ష్యానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనతకు వరుస ప్రమాదాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సరిగ్గా పది నెలల క్రితం, అంటే 2026 జనవరి 5న మలికిపురం మండలం ఇరుసుమండలోని ONGC మోరి-5 డ్రిల్లింగ్ సైట్‌లో భారీ బ్లోఅవుట్ జరిగి గ్యాస్ లీకైంది. ఆ మంటలను, లీకేజీని అదుపు చేయడానికి సహాయక బృందాలకు వారం రోజుల పాటు నరకం కనిపించింది.

ప్ర‌మాద‌క‌ర గ్యాస్ లీక్ కావ‌డంతో చుట్టుప‌క్క‌ల వ‌రి పంట‌లు, కొబ్బ‌రి తోట‌లు ధ్వంసం అయ్యాయి. ఇరుసుమండ గ్యాస్ బ్లోఅవుట్ ఘటనలో పర్యావరణ నష్టానికి సంబంధించి రూ.36.17 కోట్ల ఆస్తిన‌ష్టం వాటిల్లిన‌ట్టుగా ప్ర‌భుత్వ లెక్క‌లు చెబుతున్నాయి.

నాటి ప్రమాద సమయంలో ఇకపై కోనసీమలో ఇలాంటి గ్యాస్ లీకేజీలు పునరావృతం కాకుండా కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాల అమలు క్షేత్రస్థాయిలో శూన్యమని నేటి ఘటన నిరూపించింది.

పకడ్బందీ తనిఖీలు, పటిష్టమైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే ఓఎన్‌జీసీ రిగ్‌ల వద్ద పదేపదే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, కోనసీమలోని అన్ని ONGC బావుల వద్ద తక్షణమే సేఫ్టీ ఆడిట్ నిర్వహించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment