మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాక’ (KAAKA) విడుదల తేదీపై నెలకొన్న ఊహాగానాలకు చిత్రబృందం ఫుల్స్టాప్ పెట్టింది. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కొంతకాలంగా రిలీజ్ డేట్‌పై రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మేకర్స్ ఈ ప్రకటన చేశారు. దీంతో మెగాస్టార్ సినిమా 2027 సంక్రాంతి బరిలో అధికారికంగా నిలిచినట్లైంది.
చిరంజీవి, బాబీ కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి విజయాన్ని అందుకోవడంతో ‘కాక’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా యాక్షన్, కమర్షియల్ అంశాలతో దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ నారాయణ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన మేకర్స్.. త్వరలోనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో మెగాస్టార్ అభిమానుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.








