తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాలపై సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చల పురోగతిని అడిగి తెలుసుకున్న సీఎం.. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణం కారణంగా మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ముంపునకు గురయ్యే భూములకు తగిన పరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిహారం చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన నిధులను ప్రత్యేకంగా జాయింట్ అకౌంట్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ముంపు ప్రాంతాలు, భూముల వివరాలపై మహారాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా సర్వే నిర్వహించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. మహారాష్ట్ర అధికారులకు అవసరమైన సమాచారం, ఇప్పటివరకు కుదిరిన ఒప్పందాలు, సంబంధిత పత్రాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ముంపునకు సంబంధించిన సమగ్ర వివరాలతో అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.








