మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

మహిళా కండక్టర్ ప్రవళిక మృతి

Summarize with AI

రూ. 90 చిల్లర కోసం జరిగిన చిన్నపాటి వివాదం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. విధి నిర్వహణలో ఉన్న టీజీఎస్ఆర్టీసీ మహిళా కండక్టర్‌ను ప్రయాణికురాలు కదిలే బస్సు నుంచి కిందకు నెట్టేయడంతో తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడిన గుండ్ల ప్రవళిక (24) మంగళవారం రాత్రి హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపో పరిధిలో జరిగిన ఈ విషాద ఘటన తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులలో తీవ్ర ఆగ్రహాన్ని, శోకాన్ని నింపింది.

గత నెల (అక్టోబర్) 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు వద్ద ఈ దారుణం చోటుచేసుకుంది. అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామానికి చెందిన మౌనిక అనే ప్రయాణికురాలు తన కొడుకుతో కలిసి భద్రాచలం వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. తన కొడుకు టికెట్ కోసం రూ. 100 ఇవ్వగా, రూ. 10 టికెట్ జారీ చేసిన కండక్టర్ ప్రవళిక, మిగిలిన రూ. 90 చిల్లరను టికెట్ వెనుక రాసి ఇచ్చింది.

“ఇప్పుడే చిల్లర ఇవ్వాలి” అంటూ మౌనిక కండక్టర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ప్రవళిక నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా, ఆవేశంతో ప్రవళికను కదిలే బస్సు డోర్ వద్ద నుంచి కిందకు తోసివేసింది. బస్సులోంచి పడిపోయిన ప్రవళికపై నుంచి బస్సు వెనుక టైర్లు వెళ్లడంతో ఆమె రెండు కాళ్లు తీవ్రంగా నలిగిపోయాయి.

ప్రవళికను మొదట స్థానిక ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని ఆసుపత్రికి తరలించారు. 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆమె, బీపీ పడిపోవడంతో మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఆర్టీసీలో మెకానిక్‌గా పనిచేసిన తండ్రి నాగరాజు మృతి చెందడంతో, వారసత్వంగా కేవలం 10 నెలల క్రితమే ప్రవళిక ఆర్టీసీలో కండక్టర్‌గా బాధ్యతలు చేపట్టింది. త్వరలోనే వివాహం చేయాలని కుటుంబ సభ్యులు అనుకుంటుండగానే ఈ విషాదం చోటుచేసుకోవడంతో ఆమె కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

ప్రవళిక మృతి వార్త తెలియడంతో మణుగూరు డిపో పరిధిలో ఆర్టీసీ కార్మికులు తీవ్ర నిరసనలకు దిగారు. విధులు బహిష్కరించి డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. ప్రవళికను హత్య చేసిన ప్రయాణికురాలు మౌనికపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. ప్రవళిక మృతి చెందడం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ప్రవళిక కుటుంబానికి ప్రభుత్వం మరియు ఆర్టీసీ తరఫున రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని ప్రకటించారు. ప్రవళిక తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment