వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీపై మ‌ళ్లీ వ‌రుణుడి ప్ర‌తాపం

వాయుగుండంగా అల్పపీడనం.. ఏపీపై మ‌ళ్లీ వ‌రుణుడి ప్ర‌తాపం

Summarize with AI

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని వ‌రుణ దేవుడు మ‌రోసారి వ‌ణికిస్తున్నాడు. ఇప్ప‌టికే వ‌ర్షాల ప్ర‌భావంతో జ‌నం అత‌లాకుతలం అవుతుండ‌గా, తాజాగా మ‌రో పిడుగులాంటి వార్త‌ను వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (Low-Pressure Area) మరికొన్ని గంటల్లో వాయుగుండంగా (Cyclone ) మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాలు, ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇందులో భాగంగా ప్రకాశం, నెల్లూరు, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. నంద్యాల, అనంతపురం, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, అలాగే పల్నాడు, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. వాయుగుండం తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా తీరం వెంబడి కూడా 30–45 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఇక ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలు, అలాగే కోస్తా ఆంధ్రాలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలు తీరప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్ర యాత్రలు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

మంగళవారం ఉదయం 8:30 గంటల నుండి బుధవారం ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్ర సగటు వర్షపాతం 18.3 మిల్లీమీటర్లు నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 92.3 మిమీ, నెల్లూరు జిల్లాలో 60.8 మిమీ, చిత్తూరులో 39.5 మిమీ, అన్నమయ్యలో 37.7 మిమీ, కడపలో 22.9 మిమీ, ప్రకాశం జిల్లాలో 24.9 మిమీ సగటు వర్షపాతం నమోదైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment