కుటుంబాలను చీల్చి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం చంద్రబాబు, లోకేష్‌ల నైజమని టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు భార్య, వైసీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తీరును, వారి కుటుంబ రాజకీయాలను ఎండగట్టారు.
వైఎస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా లోకేష్ శుభాకాంక్షలు తెలపడంపై లక్ష్మీపార్వతి అభ్యంతరం వ్యక్తం చేశారు. “గతంలో విజయమ్మను దారుణంగా విమర్శించిన లోకేష్.. ఇవాళ ఏ మొహం పెట్టుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు? అసలు విజయమ్మకు లోకేష్ శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం ఏంటి?” అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నారని, ప్రజలు అన్ని గమనిస్తున్నారని లక్ష్మీపార్వతి హెచ్చరించారు.
మీ ఇంట్లో విలువలు ఎక్కడ ఉన్నాయి?
లోకేష్‌ను ఉద్దేశించి లక్ష్మీపార్వతి పలు వ్యక్తిగత, రాజకీయ ప్రశ్నలు సంధించారు. “లోకేష్.. ఏనాడైనా నీ మేనత్తలు మీ ఇంటికి వచ్చారా? కన్నతండ్రి ఎన్టీఆర్‌పై చంద్రబాబు చెప్పులేయించి అవమానిస్తుంటే, మీ అమ్మ భువనేశ్వరి ఏనాడైనా నోరు మెదిపిందా?” అని నిలదీశారు. ఏనాడైనా నన్ను అమ్మమ్మ అని పిలుస్తూ నా దగ్గరికి వచ్చావా? అసలు నా పుట్టినరోజు ఎప్పుడో నీకు తెలుసా? అమ్మానాన్నలకే విలువలు లేనప్పుడు, వారి కడుపున పుట్టిన నీకు విలువలు ఎక్కడి నుంచి వస్తాయి?” అంటూ ధ్వజమెత్తారు.
వైఎస్ జగన్ పాలనను, మహిళా సంక్షేమాన్ని ఆమె కొనియాడారు. వైసీపీ హయాంలో మహిళల ఆర్థిక, సామాజిక సాధికారత కోసం జగన్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ముఖ్యంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చి, వారిని ఇంటి యజమానులను చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు.మంచి లీడర్ అంటే వైఎస్ జగన్‌లా ఉండాలి.. చంద్రబాబు, లోకేష్ రాజకీయాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు అని వ్యాఖ్యానించారు.








