పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ ‘బిర్యానీ’ కౌంటర్..

పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ ‘బిర్యానీ’ కౌంటర్..

హైదరాబాద్ (Hyderabad) వేదికగా జనసేనాని (Jana Sena Chief) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను, ఆయన గత వైఖరిని ఎండగడుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. “సోదరుడిగా వస్తే హైదరాబాద్ బిర్యానీ (Hyderabad Biryani) పెడతాం.. కానీ పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం” అంటూ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

జనసేనను అడ్డుకుంది ఎవరు? తెలంగాణ ప్రజలే!
తెలంగాణలో(Telangana) జనసేన పోటీపై పవన్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ పూర్తిగా కొట్టిపారేశారు. “దేశంలో ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు, పోటీ చేయవచ్చు. పవన్ కళ్యాణ్‌ను ఇక్కడ పోటీ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసింది కదా! ఆయనను అడ్డుకుంది ఎవరూ కాదు.. తెలంగాణ ప్రజలే వారిని తిరస్కరించారు” అని కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో 2018 ఎన్నికల్లో టీడీపీ(TDP) పోటీ చేసి భంగపడిందని, ఇప్పుడు జనసేన పరిస్థితి కూడా అంతేనని ఎద్దేవా చేశారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి, రాష్ట్ర విభజన సరిగా జరగలేదని మాట్లాడటంపై కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “తెలంగాణ వచ్చినప్పుడు 11 రోజులు ఉపవాసం ఉన్నానని చెప్పిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తెలంగాణపై కొత్తగా ప్రేమ ఒలకబోస్తున్నారు. మీ కుటుంబాలు, మీ వ్యాపారాలు, మీ సినిమాలు అన్నీ ఇక్కడే (హైదరాబాద్‌లోనే) ఉన్నాయి కదా” అంటూ కేటీఆర్ నిలదీశారు. తెలంగాణ 4 కోట్ల మంది భూమిపుత్రుల జాగీర్ అని, ఇక్కడి సెంటిమెంట్‌తో ఆడుకుంటే కుదరదని హెచ్చరించారు.

పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో జాతీయవాదం (Nationalism) గురించి ఎక్కువగా మాట్లాడుతుండటాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. “ప్రధాని మోదీ (Narendra Modi) జాతీయవాదం ముసుగులో ‘ఆర్థిక ప్రాంతీయవాదం’ (గుజరాత్‌కే (Gujarat) అన్ని ప్రాజెక్టులు తరలించడం) చేయడం లేదా? మరి ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించరు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే మేము (BRS) ఏపీకి మద్దతుగా మాట్లాడాం.. మరి పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారు?” అని కేటీఆర్ నిలదీశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment