తెలంగాణ కాంగ్రెస్‌లో(Telangana Congress) పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Government) మూడేళ్లు పూర్తి చేసుకునే తరుణం దగ్గరపడుతుండటంతో.. అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కీలక మార్పులు తప్పవనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో (Meenakshi Natarajan) మంత్రుల వరుస భేటీలు చర్చనీయాంశంగా మారాయి.
తాజాగా మీనాక్షి నటరాజన్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) జరిపిన భేటీ, ఆ తర్వాత ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భేటీ ముగిసిన అనంతరం మీడియా ప్రశ్నించగా, సమావేశం “విషయాలు మీరు అడగొద్దు.. నేను చెప్పొద్దు” అంటూ కోమటిరెడ్డి దాటవేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏ విషయమైనా కుండబద్దలు కొట్టినట్టుగా, తన మనసులో ఏమున్నా.. అది పార్టీకి వ్యతిరేకమైనా, సొంత ప్రభుత్వానికి సంబంధించినదైనా ముక్కుసూటిగా మాట్లాడే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌తో భేటీ వివరాలను బయట పెట్టడానికి నిరాకరించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో.. కొందరు మంత్రుల పనితీరుపై హైకమాండ్ (High Command) వద్ద నివేదికలు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఇమేజ్‌ను పెంచడం కోసం కొంతమంది సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించి, వారి స్థానంలో కొత్త ముఖాలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సైతం మీనాక్షి నటరాజన్‌తో ప్రత్యేకంగా సమావేశమవ్వడం ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
అసంతృప్త నేతలను దారికి తెచ్చుకుంటూనే, మరోవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా జాగ్రత్తలు పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ ఆపరేషన్ మొత్తాన్ని అత్యంత రహస్యంగా ఉంచుతున్నట్లుగా మరోవైపు చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి లాంటి కీలక నేత “మీరు అడగొద్దు.. నేను చెప్పొద్దు” అనడం చూస్తుంటే.. భవిష్యత్తులో తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున ప్రక్షాళన జరగబోతోందని స్పష్టమవుతోంది.








బీజేపీ అంటే చెత్త కుప్ప అనుకుంటున్నారా..?