ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

ముద్రగడకు పవన్ గవర్నర్ పదవి ఇద్దామన్నారు

Summarize with AI

కాపు ఉద్య‌మ నేత, దివంగత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల అనంతరం జ‌న‌సేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడకు గవర్నర్ పదవి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావించారంటూ నాదెండ్ల చేసిన వ్యాఖ్యలపై ముద్రగడ అభిమానులు, కాపు సామాజిక పెద్దలు, రాజకీయ విశ్లేషకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ అవకాశవాదాన్ని ఎండగడుతూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. “జనసేన అధికారంలోకి వస్తుంది.. వచ్చాక ముద్రగడకు గవర్నర్ పదవి ఇద్దామని పవన్ కళ్యాణ్ నాకు చెప్పారు” అని వ్యాఖ్యానించారు. దీనిపై విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. అసలు గవర్నర్ నియామకం అనేది ఒక అత్యున్నత రాజ్యాంగ ప్రక్రియ. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వ్యవహారం. ఏ రాజకీయ పార్టీ కూడా తమ ఇష్టం వచ్చినట్లు ప్రకటించే పదవి అది కాదు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి కుట్రపూరిత ప్రకటనలు చేయడం ఏమాత్రం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పైగా, చనిపోయే ముందు వరకు వైసీపీలో కొనసాగిన ముద్రగడకు జనసేన ఎలా గవర్నర్ పదవి ఇస్తుందని చెప్పగలుగుతోందనేది పెద్ద మిస్టరీగా మారింది. ముద్రగడ పద్మనాభం బతికున్నప్పుడు ఆయనపై ఎవరు రాజకీయ దాడులు చేశారో, మానసిక క్షోభకు గురిచేశారో ప్రజలందరికీ బాగా తెలుసని ఆయన మద్దతుదారులు గుర్తుచేస్తున్నారు.

  • ముద్రగడ మాట్లాడిన ప్రతి అంశానికీ కౌంటర్ ఇవ్వడానికి, ఆయన సొంత కుమార్తెను రాజకీయంగా ఉపయోగించుకున్నది ఎవరు?
  • ముద్రగడ వివిధ ప్రజా సమస్యలపై రాసే లేఖలను ‘ప్రేమ లేఖలు’ అంటూ కించపరిచేలా మాట్లాడింది ఎవరు?
  • ప్రతి ప్రెస్‌మీట్ జరిగిన వెంటనే కుటుంబ సభ్యులతో స్పందింపజేసి, ముద్రగడ వ్యక్తిత్వాన్ని, పరువును దెబ్బతీయడానికి ప్రయత్నించింది ఎవరు?
  • నాడు తీవ్రంగా అవమానించిన నేతలే.. నేడు ముద్రగడపై లేని ప్రేమాభిమానాలు ఒలకబోస్తూ మాట్లాడటం శుద్ధ రాజకీయ అవకాశవాదం కాదా అని కాపు పెద్దలు నిలదీస్తున్నారు.

కుటుంబ విభేదాలను రాజకీయ ఆయుధంగా..
సాధారణంగా ఏ కుటుంబ వ్యవహారాలను కూడా రాజకీయాల్లోకి లాగడం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ, ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ఉండేందుకే ఈ నగ్న సత్యాన్ని ప్రస్తావించాల్సి వస్తోందని విశ్లేషకులు అంటున్నారు. ఒక తండ్రి, కుమార్తె మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలను రాజకీయ ఆయుధంగా మార్చింది ఎవరు? కుటుంబ సభ్యులను ఒకరిపై ఒకరిని నిలబెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసింది ఎవరు? ఈ ప్రశ్నలకు జనసేన నాయకత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. ఒక రాజకీయ నాయకుడిని నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక, కుటుంబాన్ని అడ్డుపెట్టుకోవడం ఎంతవరకు నైతికం అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రజాస్వామ్య హక్కును కూడా గౌరవించలేదు..
ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం ఆయన వ్యక్తిగత, రాజకీయ నిర్ణయం. ఆయన కుమారుడు కూడా వైసీపీలోనే ఉన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఏ పార్టీలో ఉండాలనేది వారి వ్యక్తిగత హక్కు. రాజకీయంగా విభేదాలు ఉంటే విధానపరంగా విమర్శించాలి. కానీ అలా కాకుండా కుటుంబాన్ని చీల్చి, రాజకీయ ప్రయోజనం పొందాలని చూడటం అత్యంత దురదృష్టకరం అంటున్నారు.

గవర్నర్ పదవి కథ వెనుక అసలు స్కెచ్ ఏంటి?
ముద్రగడ భౌతికంగా మన మధ్య లేని ఈ సమయంలో.. హఠాత్తుగా “పవన్ కళ్యాణ్ ఆయనను గవర్నర్ చేయాలనుకున్నారు” అనే కొత్త రాగాన్ని ఎందుకు అందుకుంటున్నారు? అని ముద్ర‌గ‌డ అనుచ‌రులు ప్ర‌శ్నిస్తున్నారు. బతికున్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలనే ఆలోచన ఎందుకు రాలేదు? ఆయనపై రాజకీయ దాడులు జరుగుతున్నప్పుడు జనసేన ఎందుకు మౌనంగా ఉండిపోయింది? ఒకవైపు ముద్రగడను రాజకీయంగా ఒంటరి చేస్తూ.. మరోవైపు గవర్నర్ పదవి ఇవ్వాలనుకున్నామని ప్ర‌క‌ట‌న‌ల‌ వెనుక అసలు ఉద్దేశం ఏంటి? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ పై సమాధానం చెప్పాల్సిన బాధ్యత పూర్తిగా జనసేన నాయకత్వంపైనే ఉందని డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment