తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) కేంద్రమంత్రి, బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి (G. Kishan Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత కొన్ని రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి తనపై అబద్ధాలు, అసత్యాలతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వీధి రౌడీ (Street Rowdy) లాగా వ్యవహరిస్తున్నారని, బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో (Delhi) ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన సీఎం రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు.
‘తొక్కుకుంటూ వచ్చాను.. పొలిమేరలు దాటనివ్వను.. తెలంగాణలో తిరగనివ్వను’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. “నేను చాలామంది ముఖ్యమంత్రులను చూశాను. వాళ్ల ఇళ్ల ముందే ఉద్యమాలు చేసి ఢిల్లీ వరకు వచ్చాను. అంబర్ పేట్(Amberpet), సికింద్రాబాద్(Secunderabad) ప్రజల ఆశీస్సులతో, నమ్మిన సిద్ధాంతం కోసం ఢిల్లీకి వెళ్లాను. నన్ను అడ్డుకునే ధైర్యం, శక్తి రేవంత్ రెడ్డికి లేదు. నేను తెలంగాణ ప్రజలకు జవాబుదారీని కానీ, రేవంత్ రెడ్డికి కాదు. నాకు ఆయన ఇచ్చే సర్టిఫికెట్ అవసరం లేదు” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రాజెక్టులను (Telangana Projects) కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనే రేవంత్ రెడ్డి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. “సీనియర్ జర్నలిస్టులతో ఒక కమిటీని ఏర్పాటు చేద్దాం. రేవంత్ రెడ్డి తన దగ్గరున్న సాక్ష్యాలను ఆ కమిటీకి ఇవ్వాలి. ఏ ప్రాజెక్టును నేను ఎక్కడ అడ్డుకున్నానో జర్నలిస్టులకు చెప్పాలి. వారు ఏ నివేదిక ఇస్తే దానికి నేను కట్టుబడి ఉంటాను. అవసరమైతే నా పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమే” అని సవాల్ విసిరారు.
గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 సబ్ గ్యారెంటీలను అమలుచేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి.. ఆ ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్(Diversion Politics) చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. గత రెండున్నరేళ్లుగా ఇచ్చిన హామీల అమలుపై చర్చకు సిద్ధమా? అని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ప్రెస్ క్లబ్‌లోనైనా, అమరవీరుల స్తూపం వద్దనైనా ఈ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.








