క‌విత కొత్త పార్టీ TRS.. తండ్రి, అన్న‌పై తీవ్ర విమ‌ర్శ‌లు

క‌విత కొత్త పార్టీ.. తండ్రి, అన్న‌ల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ వేదిక‌గా ఆమె తన కొత్త పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) పేరును ప్రకటించారు. క‌విత కొత్త పార్టీ ప్ర‌క‌ట‌న స‌భ అట్ట‌హాసంగా సాగింది. కేసీఆర్ స్థాపించిన పాత పేరు (TRS)నే కొద్దిపాటి మార్పుతో (తెలంగాణ రాష్ట్ర సేన) కవిత ఎంచుకోవడం ద్వారా, ఆమె మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఈ సంద‌ర్భంగా కొత్త రాజ‌కీయ పార్టీ పేరును ప్ర‌క‌టిస్తూనే సొంత కుటుంబంపై యుద్ధం ప్రకటించారు. పార్టీ ప్రకటన వేదికగా కవిత తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “కేసీఆర్ గారు ఇప్పుడు మన పాత కేసీఆర్ కాదు.. ఆయన ఒక మరమనిషిలా మారిపోయారు” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.

జాతీయ రాజకీయాల పేరుతో బీఆర్ఎస్‌ను స్థాపించి కేసీఆర్ ఏం సాధించారని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ అస్తిత్వాన్ని పక్కన పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఒకే ఒక అజెండా ఉందని, అది “తండ్రి ఫాంహౌస్‌లో ఉండాలి.. కొడుకు (కేటీఆర్) ముఖ్యమంత్రి కావాలి” అనే సింగిల్ సిద్ధాంతంతో నడుస్తోందని ఎద్దేవా చేశారు. పార్టీ వ్యవహారాల్లో అన్న కేటీఆర్‌కు క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన లేదని, ఆయనకు ఏమీ తెలియదంటూ విమర్శించారు. తండ్రి, అన్నలపై ఆమె చేసిన తిరుగుబాటు తెలంగాణ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.

కవిత ‘పాంచజన్యం’ – ఐదు గ్యారెంటీలు
తెలంగాణ ప్రజల కోసం తన పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే ‘పాంచజన్యం’ పేరుతో ఐదు ప్రధాన హామీలను కవిత ప్రకటించారు.

విద్య: (అందరికీ ఉచిత విద్య) ప్రభుత్వ పాఠశాలలతో పాటు, ప్రైవేట్ స్కూళ్లలో కూడా సామాన్యులకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.

వైద్యం: (సంపూర్ణ ఆరోగ్య రక్షణ) జబ్బు ఏదైనా, ఆస్పత్రి ఏదైనా సరే.. రూపాయి ఖర్చు లేకుండా ఉచిత వైద్యం అందించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు.

వ్యవసాయం: (రైతే రాజు) “రైతే రాజు” అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా, రైతుల పెట్టుబడి నుంచి మార్కెటింగ్ వరకు పూర్తి అండగా నిలుస్తామని ప్రకటించారు.

ఉపాధి: (ఉద్యోగాల జాతర) నిరుద్యోగ యువత కోసం కవిత భారీ ప్యాకేజీని ప్రకటించారు. యువత స్వయం ఉపాధి కోసం రూ. 2 లక్షల నుంచి రూ. 20 కోట్ల వరకు రుణాలు అందిస్తాం. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్‌ ద్వారా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తూ వారికి 1 లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పిస్తాం.

సామాజిక న్యాయం : సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడమే తమ పార్టీ అంతిమ లక్ష్యమని, సామాజిక న్యాయం సాధించి తీరుతామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment