రక్షక భట నిలయాలే భక్షక నిలయాలుగా మారుతున్నాయా? న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారే కామాంధుడిలా మారి ఒక మహిళను (Woman) వేధించిన ఘటన కర్ణాటకలోని (Karnataka) దక్షిణ కన్నడ జిల్లాలో కలకలం రేపుతోంది. మూడబిదిరె పోలీస్ స్టేషన్ సీఐ సందేశ్ (CI Sandesh) తనపై సాగించిన అరాచకాలను వివరిస్తూ ఒక బాధితురాలు మంగళూరు పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కథనం ప్రకారం.. గత ఏడాది ఆగస్టులో ఆమె భర్తను ఒక కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. తన భర్తను విడిపించాలని కోరుతూ ఆమె సీఐ సందేశ్‌ను సంప్రదించింది. అయితే, ఆ సమయంలో సీఐ ఆమెతో అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు.
“నీ భర్తను వదిలిపెట్టాలంటే ఈ రాత్రికి నా పడకగదికి రావాలి.. లేదా 25 లక్షల రూపాయలు ఇచ్చుకోవాలి” అని సీఐ సందేశ్ సదరు మహిళను వేధించినట్లు సమాచారం. అంతటితో ఆగకుండా, “నేను హోంమంత్రికి 50 లక్షల రూపాయలు లంచం ఇచ్చి ఈ పోస్టింగ్ తెచ్చుకున్నాను. నేను అడిగినంత డబ్బు ఇస్తేనే నీ భర్తను వదులుతాను, లేదంటే అతడిపై రౌడీషీట్ తెరుస్తాను” అని బెదిరింపులకు దిగినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీస్ అధికారి సాగించిన ఈ లైంగిక వేధింపులు (Sexual Harassment) మరియు అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ (Karnataka State Women Commission) తీవ్రంగా స్పందించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. హోంమంత్రి పేరును వాడుకుంటూ, మహిళలను లోబర్చుకోవాలని చూస్తున్న ఇలాంటి అధికారుల తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాపాడాల్సిన వారే కంచె చేను మేసిన చందంగా ప్రవర్తిస్తుంటే సామాన్యులకు దిక్కెవరని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.








