రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడిగా, తటస్థ జర్నలిస్టుగా ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌కు (Professor K. Nageshwar) ఉన్న విశ్వసనీయత ప్రత్యేకమైనది. వామపక్ష భావజాలం ఉన్నప్పటికీ, ఏ విషయాన్నైనా సునిశితంగా, లోతుగా విశ్లేషించే ఆయన శైలిని విపక్ష నేతలు సైతం గౌరవిస్తుంటారు. గతంలో ఒకటిరెండు సందర్భాల్లో బీజేపీ(BJP) నేత లంకా దినకర్ (Lanka Dinakar) మినహా, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఎవరూ సాహసించలేదు.
ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం (Tirumala Laddu Prasadam) వివాదంపై నిజాలు మాట్లాడినందుకు కొందరు టీడీపీ(TDP) సానుభూతిపరులు ఫోన్లలో బూతులు తిడుతున్నారని, దీనిని అరికట్టాలని మంత్రి నారా లోకేశ్‌ను (Nara Lokesh) ప్రొఫెసర్ బహిరంగంగానే కోరారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఈ నేపథ్యంలో, తాజాగా ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మధ్య జరిగినట్లుగా చెబుతున్న ఒక అంతర్గత సంభాషణను ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటపెట్టడం ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ఈ క్రమంలో ఒక తెలుగు టీవీ ఛానెల్ డిబేట్లో జనసేన తిరుపతి నాయకుడు కిరణ్ రాయల్(Kiran Royal), ప్రొఫెసర్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
అసలు వివాదం ఏమిటి?
ప్రొఫెసర్ నాగేశ్వర్ తన విశ్లేషణలో.. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లినప్పుడు వైఎస్ జగన్‌ను (YS Jagan) తక్షణమే అరెస్ట్ చేయాలని అమిత్ షాను కోరినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తనకు సమాచారం అందిందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన అమిత్ షా.. పవన్ కల్యాణ్‌కు గట్టిగానే హితబోధ చేశారని ప్రొఫెసర్ వెల్లడించారు. “ఏపీలోని 25 మంది ఎంపీల మద్దతు మాకు ఉంది. చంద్రబాబు (Chandrababu Naidu) మాకు ‘ఇన్స్టంట్ ఫ్రెండ్'(Instant Friend) మాత్రమే కావచ్చు, కానీ వైఎస్ జగన్ (YS Jagan) మాకు ‘లాంగ్‌టర్మ్ ఫ్రెండ్'(Long-Term Friend) అని అమిత్ షా అన్నట్లుగా ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఈ సమాచారం జనసేన కోర్ కమిటీ సమావేశంలో పవన్, మనోహర్ లు స్వయంగా పంచుకున్నప్పుడు లీక్ అయిందని ఆయన వివరించారు.
ప్రొఫెసర్‌పై జనసేన బాడీ షేమింగ్
ఈ విశ్లేషణపై జనసేన (Jana Sena) శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఓ టీవీ డిబేట్లో పాల్గొన్న జనసేన నేత కిరణ్ రాయల్ అన్ని హద్దులూ దాటి ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆయన శారీరక లోపాన్ని (అంధత్వాన్ని) కూడా ప్రస్తావిస్తూ కింది విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
“మతి ఉండే మాట్లాడుతున్నారా? లేక పేటీఎం డబ్బు కోసం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అమిత్‌షా దగ్గరికెళ్లి ప్రజా సమస్యల గురించి మాట్లాడుతాం తప్ప, ఇంకో పార్టీ నాయకుడి అరెస్ట్ గురించి ఎందుకు ప్రస్తావిస్తాం? ప్రొఫెసర్ నాగేశ్వర్ పెద్ద పేటీఎంగా మాట్లాడుతున్నారు. ఆయన వైసీపీకి అమ్ముడుపోయారు, వెంటనే క్షమాపణ చెప్పాలి. కాపులు, కమ్మల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రొఫెసర్ ప్రయత్నిస్తున్నారు. ప్రొఫెసర్‌కు కళ్లు కనిపించవు.. ఏదో సమస్య ఉందట.. జ్ఞాననేత్రంతో చెబుతాడట! పేటీఎం పైసల కోసం పనిచేస్తున్న ఈయన, ఇంతకంటే తాడేపల్లిలో జగన్ ఆఫీస్‌లో క్యాషియర్‌గా పని చేసుకోవచ్చు” అని కిరణ్ రాయల్ తూలనాడారు.
క్షమాపణలు చెప్పాల్సింది ఎవరు?
ఒక సీనియర్ ప్రొఫెసర్, మేధావిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంత నీచమైన రీతిలో కామెంట్లు చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఎన్నికల సమయంలో 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పటి వరకు ఎంత మందిని వెనక్కి తెచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఏ ఆధారంతో మాట్లాడారని, వెంటనే వాలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ కూడా ఉంది. కాగా, ప్రొఫెసర్ నాగేశ్వర్ క్షమాపణ చెప్పాలని జనసేన డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో.. శారీరక లోపాన్ని ఎత్తిచూపుతూ హద్దులు దాటినందుకు అసలు క్షమాపణ ఎవరు చెప్పాలో జనసేన అధిష్టానమే ఆలోచించుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









‘ఇన్‌స్టా’లో రికార్డ్.. ‘ఎక్స్’లో బ్లాక్.. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ కథ కంచికి?