కంటిచూపు మందగించినా.. వయసు 80 ఏళ్లు దాటినా.. ఆ చేతులు వయోలిన్‌ను (Violin) వదలలేదు. ఆకలి తీరడానికి, భార్యను సాకడానికి ఆ వృద్ధ కళాకారుడు సంగీతాన్నే నమ్ముకున్నాడు. రోజుకు కేవలం వంద రూపాయల సంపాదన కోసం కోల్‌కతా (Kolkata) నగర వీధుల్లో కన్నీళ్లను దిగమింగుతూ అతను పలికిస్తున్న వయోలిన్ రాగాలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ వృద్ధుడి దీనగాథ ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ (Mahindra Group Chairman) ఆనంద్ మహీంద్రాను (Anand Mahindra) తీవ్రంగా కలచివేసింది. తాను స్వయంగా ఆర్థిక సాయం అందిస్తానని ఆయన ప్రకటించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
కోల్‌కతాకు చెందిన 80 ఏళ్ల భగవాన్ మల్లిక్ (Bhagwan Mallick) చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. తన తండ్రి నేర్పించిన వయోలిన్ (Violin) విద్యే ఆ తర్వాత అతనికి బతుకుదెరువుగా మారింది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఒకే పాత, విరిగిపోయిన వయోలిన్‌తో అతను వీధుల్లో సంగీతాన్ని వినిపిస్తూ పొట్టపోసుకుంటున్నాడు.
కంటిచూపు సరిగ్గా లేకపోయినా, ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు కోల్‌కతాలోని న్యూటౌన్ బస్టాండ్(Bus Stand), డిఎల్ఎఫ్ సబ్‌వే (DLF Subway), ఆర్ట్ స్ట్రీట్ (Art Street) పరిసరాల్లో భగవాన్ మల్లిక్ వయోలిన్ వాయిస్తూ కనిపిస్తాడు. దీని ద్వారా రోజుకు కేవలం రూ. 100 మాత్రమే సంపాదిస్తూ, అద్దె ఇంట్లో ఉంటున్న తన భార్యను పోషిస్తున్నాడు. ఆయన వయోలిన్ వాయిస్తుంటే, భార్య ఆయనకు అండగా పక్కనే కూర్చోవడం అందరినీ కదిలిస్తోంది.
ఈ వైరల్ వీడియో ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) దృష్టికి వెళ్ళింది. ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆ వీడియోను షేర్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. “సంగీతంపై అతనికున్న మక్కువ నన్ను ఎంతగానో కదిలించింది. నాతో పాటు ఆయన ప్రతిభకు ముగ్ధులైన ఎంతో మంది ఆయనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, ఈ వీడియోలో అతను ఎక్కడ ఉంటాడు? ఎలా సహాయం చేయాలి? అనే వివరాలు లేవు. ఎవరికైనా తెలిస్తే ఆ వివరాలు పంపండి, నేను ఖచ్చితంగా సహాయం అందిస్తాను.”
ఆనంద్ మహీంద్రా అడగడమే ఆలస్యం.. నెటిజన్లు క్షణాల్లో స్పందించారు. భగవాన్ మల్లిక్ ప్రతిరోజూ ఎక్కడ కూర్చుంటాడో, ఆ వివరాలను, లొకేషన్లను కామెంట్ల రూపంలో మహీంద్రాకు అందించారు.
కళాకారుడికి గౌరవం దక్కాలనే ఉద్దేశంతో మొదలైన ఈ చిన్న ప్రయత్నం ఇప్పుడు పెద్ద ఉద్యమంగా మారింది. ఆరాధన ఛటర్జీ నేతృత్వంలో నెటిజన్లు స్పందించి ఇప్పటికే భగవాన్ మల్లిక్‌కు ఒక కొత్త వయోలిన్‌ను బహుమతిగా ఇవ్వడమే కాకుండా, దాదాపు రూ. 1 లక్ష వరకు విరాళాలు సేకరించి అందించారు. ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తల్లో ఒకరైన ఆనంద్ మహీంద్రా కూడా తోడుగా నిలబడటంతో, ఆ వృద్ధ దంపతుల కష్టాలు తీరబోతున్నాయని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.








