దేశంలో సంచలనం సృష్టించిన నీట్ (NEET), సీబీఎస్‌ఈ (CBSE) పరీక్షల అక్రమాలపై ఒక వినూత్న డిజిటల్ యుద్ధాన్ని సృష్టించిన ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. పరీక్షల లీకేజీలు, అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) తక్షణమే తన పదవికి రాజీనామా (Resignation) చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం జరిగిన తమ మొట్టమొదటి అధికారిక ప్రెస్ మీట్‌లో పార్టీ ప్రతినిధులు ఈ వివరాలను వెల్లడించారు.
ఆన్‌లైన్ వేదికగా నెటిజన్లను ఆకట్టుకుంటూ రాజకీయ వ్యంగ్యాస్త్రాలు సంధించే ‘కాక్‌రోచ్ జనతా పార్టీ'(Cockroach Janata Party). మొదటిసారిగా ప్రత్యక్షంగా పబ్లిక్ ముందుకు వచ్చింది. ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ముగ్గురు అధికారిక ప్రతినిధులను పార్టీ నియమించింది.
ముఖ్య అధికారిక ప్రతినిధి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సౌరవ్ దాస్ (Sourav Das) నేతృత్వంలో పొలిటికల్ రీసెర్చర్ విజేత దహియా(Vijeta Dahiya), ఐఐటీ కాన్పూర్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పూర్వ విద్యార్థి, ఫిల్మ్ మేకర్ అశుతోష్ రంకా (Ashutosh Ranka) మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ సంస్థకు అందుతున్న నిధులపై వస్తున్న ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు.
పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే (Abhijeet Deepke) జూన్ 6 (శనివారం) ఉదయం 8 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి మద్దతుదారులు, యువతతో కలిసి జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఉద్యమానికి ప్రముఖ పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk) కూడా మద్దతు ప్రకటించారని, ఆయన కూడా ఈ నిరసనలో పాల్గొనే అవకాశం ఉందని దాస్ వెల్లడించారు.
“అభిజీత్ దీప్కేకు స్వాగతం పలికేందుకు మద్దతుదారులంతా ఎయిర్‌పోర్టుకు రావాలని పిలుపునిచ్చాం. అక్కడ నుంచి అందరం కలిసి పార్లమెంట్ స్ట్రీట్ వైపు వెళ్లి, జంతర్ మంతర్ వద్ద నిరసన కోసం అనుమతి కోరతాం. దేశ భవిష్యత్తు అయిన యువత సమస్యపై జరుగుతున్న ఈ పోరాటంలో ఏ రాజకీయ రంగులతో సంబంధం లేకుండా అందరూ పాల్గొనవచ్చు” అని సౌరవ్ దాస్ పిలుపునిచ్చారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే తమ ఏకైక డిమాండ్ అని సిజెపి స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీక్ వ్యవహారం, సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకలు దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేశాయని, దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం ఆన్‌లైన్ శటైర్ మాత్రమే కాదు, యువత జవాబుదారీతనం కోసం చేస్తున్న ఒక రాజకీయ ఉద్యమం అని పార్టీ ప్రతినిధులు నొక్కి చెప్పారు.









బాబు పాలనలో గంజాయి పంటకే గిట్టుబాటు ధర