I&PR ‘ఆభరణం’లా మారింది – అధికారుల‌పై సీఎం చిందులు

I&PR ‘ఆభరణం’లా మారింది - అధికారుల‌పై సీఎం చిందులు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో వెళ్లకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) పనితీరును సమీక్షించిన ఆయన, అధికారుల వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో కష్టపడి అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు వివరించడంలో శాఖ విఫలమవుతోందని ఆయన మండిపడ్డారు.

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన ఐ అండ్ పీఆర్ వ్యవస్థ (I&PR System) ప్రస్తుతం పనిచేయకుండా కేవలం ఒక ‘ఆభరణం’లా మారిందని సీఎం విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచకపోతే ఆ ప్రయాస వృథా అవుతుందని పేర్కొన్నారు.

ఇన్ ఫ్ల్యూయెన్సర్ల సహాయం తీసుకోండి
ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రాధాన్యతను గుర్తించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం అధికారిక ప్రకటనలకే పరిమితం కాకుండా, సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయెన్సర్ల సహాయంతో పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సామాన్యులకు అర్థమయ్యే రీతిలో అభివృద్ధిని వివరించాలని, అందుకోసం ఆధునిక మార్గాలను అన్వేషించాలని ఆదేశించారు.

అభివృద్ధిని అడ్డుకుంటే ఎలా?
అధికారుల పనితీరు అభివృద్ధికి ఊతమిచ్చేలా ఉండాలి తప్ప, అడ్డుకునేలా ఉండకూడదని చంద్రబాబు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన పోడు వ్యవసాయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “అధికారులు నిబంధనల పేరుతో అభివృద్ధిని అడ్డుకుంటే ఫలితాలు రావు. గతంలో పోడు వ్యవసాయాన్ని అడ్డుకుని ఉంటే, ఈరోజు అరకులో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కాఫీ పంట ఉండేదా?” అని ఆయన ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ఐ అండ్ పీఆర్ విభాగం పూర్తిస్థాయిలో యాక్టివ్ కావాలని ఆయన స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment