రేవంత్ వ్యాఖ్యలపై చంద్ర‌బాబు మౌనం.. ‘సీమ లిఫ్ట్‌’పై విమ‌ర్శ‌లు

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్ర‌బాబు మౌనం.. సీమ లిఫ్ట్‌పై విమ‌ర్శ‌లు

తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన సంచలన వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఇప్పటివరకు స్పందించకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (Rayalaseema Lift Irrigation Project)ను తానే ఆపించానని, అది కూడా క్లోజ్ రూమ్ సమావేశంలో చంద్రబాబుతో మాట్లాడిన తర్వాతే జరిగిందని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి వెల్లడించడంతో వివాదం మరింత ముదిరింది.

అయితే ఈ వ్యాఖ్యలపై నాలుగు రోజులు అయినా, చంద్రబాబు నాయుడు నోరు విప్పకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోల‌వ‌రం ప్రాజెక్ట్ సంద‌ర్శ‌న సంద‌ర్భంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించినా, రేవంత్ విష‌యంలో సెలైన్స్ పాటించారు. అసలు ఇద్దరి మధ్య ఏం ఒప్పందం జరిగిందో, తెలంగాణ ఒత్తిడికి ఎందుకు తలొగ్గాల్సి వచ్చిందో సీఎం చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పకుండా మౌనం పాటించడం వెనకేదో నిగూడ ర‌హ‌స్యం దాగుంద‌ని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే మరో దుమారం రేపుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు అసలు అవసరమే లేదన్న ధోరణిలో ఆయన మాట్లాడుతున్నారని, రాయలసీమ రైతుల ఆందోళనను లెక్క చేయకుండా ప్రాజెక్టును తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాయలసీమ లిఫ్ట్‌ను పూర్తి చేస్తారా? లేదా? అన్న కీలక ప్రశ్నకు ఇప్పటికీ చంద్రబాబు స్పష్టమైన సమాధానం ఇవ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై స్పందించిన చంద్రబాబు.. “ఆ ప్రాజెక్టుకు అసలు మీనింగ్ ఉందా?” అంటూ ప్రశ్నించడం, అనవసరంగా రూ.900 కోట్లు ఖర్చు పెట్టారని వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. అంతేకాదు, అనుమతులు లేని ప్రాజెక్టులు ప్రారంభించి రూ.2 వేల కోట్ల వరకు ఖర్చు చేశారంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై నిందలు వేశారు.

ప్రాజెక్టుకు కేవలం 22 టీఎంసీల నీటితో ఏమి సాధ్యమవుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించడం కొసమెరుపు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను తానే ఆపించానని రేవంత్ రెడ్డి చెబుతుంటే, మరోవైపు ఆ ప్రాజెక్టునే తప్పుబడుతూ చంద్రబాబు మాట్లాడటం రాజకీయంగా అనేక సందేహాలకు దారి తీస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాయలసీమ రైతుల భవిష్యత్తుకు కీలకమైన ఈ ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలని, రాజకీయ ఆరోపణలు కాదు – స్పష్టమైన నిర్ణయాలు చెప్పాలని డిమాండ్ పెరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment