సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే ‘షాక్’

సీటు త్యాగం చేసిన వర్మకు సొంత పార్టీలోనే 'షాక్'

Summarize with AI

కూటమి పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం తన సిట్టింగ్ సీటును త్యాగం చేసిన టీడీపీ సీనియర్ నేత ఎస్వీఎస్ఎన్ వర్మకు (SVSN Varma) ఇప్పుడు సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నిన్నటి పిఠాపురం ప్రోటోకాల్ రచ్చపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu), వర్మ తీరుపై అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

పిఠాపురంలో (Pithapuram) ఒక ప్రభుత్వ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడాన్ని వర్మ ప్రశ్నించారు. ఈ క్రమంలో జనసేన నేత పెండెం దొరబాబు వర్మపైకి దూసుకురావడం, దాడికి యత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో కూటమిలోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి.

కాగా, ఈ వివాదం టీడీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దృష్టికి చేరింది. చంద్రబాబు అనూహ్యంగా వర్మపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఐక్యంగా ఉండి పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ప్రోటోకాల్ పేరుతో ఘర్షణలకు దిగడం ఏంటని వర్మను తప్పుబట్టారని టీడీపీ(TDP) అనుకూల మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. వర్మ కావాలనే వివాదాలు సృష్టిస్తున్నారని జనసేన నేతలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో, బాబు కూడా వర్మ తీరును తప్పుబట్టడం చర్చనీయాంశమైంది.

మింగుడుపడని ‘అధిష్టానం’ నిర్ణయం
జనసేన నేతలు తనపై దాడికి ప్రయత్నిస్తే, కనీసం బాసటగా నిలవాల్సిన అధినేతే తనపై సీరియస్ అవ్వడం వర్మకు, ఆయన అనుచరులకు మింగుడుపడటం లేదన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. “పొత్తు కోసం ప్రాణప్రదమైన సీటును వదులుకున్నాం. ప‌వ‌న్‌కు 80 వేల ఓట్ల మెజార్టీ రావడంలో వర్మ కృషి ఎంతో ఉంది. అలాంటి నేతపై అవతలి వారు దాడికి వస్తే, మా నాయకుడే మమ్మల్ని తప్పుబట్టడం ఏంటి?” అని వర్మ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పిఠాపురంలో వర్మకు రాజకీయంగా ప్రాధాన్యత తగ్గించేలా కుట్ర జరుగుతోందని ఆయన అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ‌తంలో పిఠాపురం వేదిక‌గా నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో పవన్ విజయానికి తామే కారణమని ఎవరైనా అనుకుంటే, అది వారి వారి ఖర్మ మాత్రమేనని నాగ‌బాబు(Naga Babu) వ‌ర్మ‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్య‌లను సైతం గుర్తుచేసుకుంటున్నారు. ఒకవైపు జనసేన నేతల దూకుడు, మరోవైపు సొంత పార్టీలో తలెత్తిన అసంతృప్తి వర్మను ఆత్మరక్షణలో పడేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment