విజయవాడలో విజయ డైరీ (Vijaya Dairy) చైర్మన్ చలసాని ఆంజనేయులు వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశమైంది. చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొద్ది గంటల్లోనే ఆయనపై రాజీనామా చేయాలంటూ ఒత్తిళ్లు తెచ్చారని డైరెక్టర్ వేమూరి సాయి అసలు బండారం బయటపెట్టారు. ఈ ఒత్తిళ్ల కారణంగానే ఆయన అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు.
డైరెక్టర్ల సమావేశంలో చలసాని ఆంజనేయులు విజయ డెయిరీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఎన్నిక అనంతరం రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి విజయ డెయిరీ కార్యాలయానికి వెళ్లి చైర్మన్ పదవికి వెంటనే రాజీనామా చేయాలని సూచించినట్లు ఆయన సన్నిహితులు, డైరెక్టర్లు చెబుతున్నారు.
టీడీపీ అధిష్టానం నిర్ణయం మేరకే పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని, ఆలస్యం చేయడానికి అవకాశం లేదని ఆయనకు స్పష్టం చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఒక్కరోజు సమయం ఇవ్వాలని చలసాని కోరినా, అందుకు మంత్రులు అంగీకరించలేదని డైరెక్టర్ సాయి తెలిపారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగిందని, ఏడేళ్లుగా ఆంజనేయులు ఛైర్మన్ గా ఉన్నారని, డైరెక్టర్లందరూ ఏకగ్రీవంగా ఆయన్ని మళ్లీ ఛైర్మన్ గా ఎన్నుకున్నారని వేమూరి సాయి తెలిపారు. కానీ మంత్రులు మాత్రం రాజీనామా చేయమని ఒత్తిడి చేస్తున్నారు.. ఆస్పత్రికి కూడా రాజీనామా పత్రాన్ని డైరెక్టర్లతో పంపారని వెల్లడించారు.
నిన్న సాయంత్రం మంత్రులతో చర్చల సమయంలోనే చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. అనంతరం ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో ఆస్పత్రి నుంచి వెంటనే డిశ్చార్జ్ చేయాలని ఆస్పత్రి యాజమాన్యంపై కూడా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చైర్మన్ రాజీనామా చేయకపోతే డైరెక్టర్లతో అవిశ్వాస తీర్మానం పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా సమాచారం. మిగిలిన డైరెక్టర్లపై కూడా ఒత్తిళ్లు కొనసాగుతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన సన్నిహితుడు ఆస్పత్రిలో పరామర్శ అనంతరం మీడియాకు వివరించడం సంచలనంగా మారింది.








