మహిళల భద్రత (Women Safety) కోసం ఉద్దేశించిన ‘దిశ బిల్లు’ను(Disha Bill) ఉపసంహరించుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం (Andhra Pradesh State Cabinet) తీసుకున్న మరుసటి రోజే పల్నాడు జిల్లాలో(Palnadu District) అత్యంత భయంకరమైన దారుణం వెలుగు చూసింది. ప్రేమించిన యువతిని దారుణంగా హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా మృతదేహాన్ని తగలబెట్టిన ప్రేమోన్మాది ఘాతకం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేటకు(Chilakaluripet) చెందిన షేక్ హసీనా(Sheikh Haseena) (25) అనే యువతి గత రెండు రోజుల క్రితం అనుమానాస్పదంగా కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
పోలీసుల గాలింపు చర్యల్లో భాగంగా కారంపూడి (Karempudi) శివారు (చింతపల్లి ప్రాంతంలో) సుమారు 90 శాతం కాలిపోయిన స్థితిలో హసీనా మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. కారంపూడి మండలం ఇనుపరాజుపల్లి గ్రామానికి చెందిన జిలుగు బాల సైదులు (Jilugu Bala Saidulu) అనే యువకుడే ఈ ఘాతకానికి ఒడిగట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
హసీనాను కారంపూడి శివారు ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిన అనంతరం, శవాన్ని దహనం చేసి నిందితుడు బాల సైదులు ప్రకాశం జిల్లాకు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి బాధితురాలు, నిందితుడి సెల్ఫోన్ సిగ్నల్స్ (Tower Locations) ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రకాశం జిల్లాలో దాక్కున్న నిందితుడు బాలాను కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
మహిళలపై జరుగుతున్న నేరాలకు కఠిన శిక్షలు పడేలా గత వైసీపీ ప్రభుత్వంలో(YCP Government) తెచ్చిన ‘దిశ బిల్లు’ను ఉపసంహరించుకునేందుకు గురువారం కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రకటన వెలువడిన 24 గంటల వ్యవధిలోనే పల్నాడు జిల్లాలో యువతి దారుణంగా హత్యకు గురికావడం, మృతదేహాన్ని 90% తగలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.








