తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) కీలక పరిణామం చోటుచేసుకుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీతో (Jana Sena Party) బీజేపీ(BJP) పొత్తు కొనసాగుతుందంటూ జరుగుతున్న ప్రచారానికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చింది. తెలంగాణలో ఏ పార్టీతోనూ పొత్తు (Alliance) పెట్టుకునేది లేదని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు (Ramachandra Rao) స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఏకపక్షంగా (Single-Handedly) అధికారంలోకి రావడమే లక్ష్యంగా పార్టీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తోందని రామచంద్రరావు తెలిపారు. పశ్చిమ బెంగాల్ (West Bengal) తరహాలోనే తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి ప్రతి మూడు నెలలకొకసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో విస్తృతంగా పర్యటించనున్నారని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 937 మండలాల్లో గ్రాస్రూట్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే చర్యలు వేగవంతం చేశామన్నారు.
పలువురు కీలక నేతలు తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, సరైన సమయం చూసి వారిని ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. పార్టీ నేతల మధ్య ఎలాంటి తీవ్రమైన విభేదాలు లేవని, కేవలం కొన్ని విషయాల్లో భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.
బీజేపీ ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ (Nitin Nabin) దిశానిర్దేశం మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలందరం కలిసికట్టుగా పోరాటాలు నిర్వహిస్తామన్నారు. మరోసారి ప్రత్యేకంగా సమావేశమై, అధికారం దిశగా అనుసరించాల్సిన పూర్తిస్థాయి కార్యాచరణ (రోడ్ మ్యాప్)ను ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ఏపీలో (Andhra Pradesh) పొత్తులో ఉన్నప్పటికీ, తెలంగాణలో(Telangana) మాత్రం పొత్తులు లేకుండా ఒంటరిగానే ముందుకెళ్తామని బీజేపీ క్లారిటీ ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.








