అస్సాంలో భారీ వరదలతో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబాలకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అండగా నిలిచారు. వరద బాధితులకు సురక్షితమైన నివాసం కల్పించేందుకు చేపట్టిన ‘ఆషియానా – సురక్షిత ఆశ్రయంతో ఆశ మొదలవుతుంది’ కార్యక్రమానికి ఆయన మద్దతు ప్రకటించారు. ప్రకృతి విపత్తుల కారణంగా ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు శాశ్వత లేదా దీర్ఘకాలిక నివాసాన్ని అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మొత్తం 500 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్వాహకులు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే అస్సాంలోని నేపాలీ ఖుటి ప్రాంతంలో తొలి దశలో 220 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లు వెల్లడించారు. ఈ ఇళ్ల ద్వారా వందలాది వరద బాధిత కుటుంబాలకు సురక్షితమైన ఆశ్రయం లభించనుండటంతో ఈ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ముందుండే సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వడంతో మరింత మంది దాతలు, స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో నటుడు రణదీప్ హుడా రేషన్, నిత్యావసర వస్తువుల పంపిణీలో పాల్గొనగా, నటి భూమి పెడ్నేకర్ కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యమవుతున్నట్లు సమాచారం. వరదలతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఇళ్లు, ఆహారం, అవసరమైన సదుపాయాలు అందించడం ద్వారా వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం జరుగుతోంది. సల్మాన్ ఖాన్ మద్దతుతో ‘ఆషియానా’ కార్యక్రమం మరింత విస్తృత స్థాయిలో కొనసాగి, అస్సాం వరద బాధితులకు కొత్త ఆశను అందిస్తుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.








