పంజాబ్‌పై బీజేపీ ‘ఆపరేషన్ లోటస్’.. ఆప్‌లో భారీ చీలిక

పంజాబ్‌పై బీజేపీ 'ఆపరేషన్ లోటస్'.. ఆప్‌లో భారీ చీలిక

వచ్చే ఏడాది (ఫిబ్రవరి 2027) జరగనున్న పంజాబ్ (Punjab) అసెంబ్లీ ఎన్నికలే (Assembly Elections) లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party – BJP) తన వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగా పంజాబ్ అధికార పార్టీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీకి (Aam Aadmi Party – AAP) కోలుకోలేని దెబ్బ తీసింది. ఆప్ రాజ్యసభ సభ్యుల్లో ఏకంగా ఏడుగురు (7/10) బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా పెను సంచలనం సృష్టించింది.

రాఘవ్ చడ్డా నేతృత్వంలో తిరుగుబాటు
ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) అత్యంత ఆప్తుడిగా, పంజాబ్ ఆప్ ఇంచార్జిగా చక్రం తిప్పిన రాఘవ్ చడ్డా (Raghav Chadha) ఈ చీలికకు నాయకత్వం వహించిన‌ట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న రాఘవ్ చడ్డాను, ఇటీవలే రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుండి ఆప్ తొలగించింది. ఆయన స్థానంలో అశోక్ మిట్టల్‌ను (Ashok Mittal) నియమించడం చడ్డా వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. రాఘవ్ చడ్డాతో పాటు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్, రాజేంద్ర గుప్త, విక్రమ్ సాహ్నీ వంటి కీలక నేతలు కమలం తీర్థం పుచ్చుకున్నారు.

పంజాబ్‌లో సొంతంగా ఎదగాలని
గతంలో శిరోమణి అకాలీ దళ్ (SAD)తో మిత్రపక్షంగా ఉన్న బీజేపీ, ఇకపై పంజాబ్‌లో ఎవరితోనూ పొత్తు లేకుండా సొంతంగా ఎదగాలని నిర్ణయించుకుంది. పాకిస్తాన్‌తో సరిహద్దు పంచుకునే పంజాబ్ వంటి సున్నితమైన రాష్ట్రంలో జాతీయ భద్రత దృష్ట్యా తాము అధికారంలోకి రావాలని బీజేపీ అధిష్టానం బలంగా ఆశిస్తోంది. పంజాబ్‌ను డ్రగ్స్, అప్పుల ఊబి నుండి కాపాడాలంటే బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

ఆప్ ఆరోపణలు.. ప్రజాస్వామ్య ఖూనీ!
ఈ పరిణామాలపై ఆప్ తీవ్రంగా స్పందించింది. కేంద్ర సంస్థలైన ED, CBIలను ఉపయోగించి బీజేపీ “ఆపరేషన్ లోటస్” చేపట్టిందని ఆరోపించింది. భగవంత్ మాన్ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను అడ్డుకోవడమే బీజేపీ లక్ష్యమని, పంజాబ్ ప్రజలు ఈ ద్రోహాన్ని క్షమించరని ఆప్ నేతలు మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment