బిస్లరీ వాటర్ సురక్షితమేనా? FSSAI చర్యలపై సంస్థ వివరణ

బిస్లరీ వాటర్ సురక్షితమేనా? FSSAI చర్యలపై సంస్థ వివరణ

Summarize with AI

ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ బిస్లరీ (Bisleri)పై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలకు సిద్ధమైంది. సంస్థకు చెందిన వాటర్ శాంపిల్ భద్రతా పరీక్షల్లో విఫలమైన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్–2006 కింద బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, తమ నీరు వినియోగానికి సురక్షితమైనదేనని బిస్లరీ సంస్థ స్పష్టం చేసింది. ఈ వివాదం 2025 సెప్టెంబర్‌లో గోవాలోని తమ తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేసిన ఒక బ్యాచ్‌కు సంబంధించినదని వెల్లడించింది.

బిస్లరీ వివరాల ప్రకారం..
2025 సెప్టెంబర్ 30న FSSAI అధికారులు గోవా ప్లాంట్ నుంచి ఆరు శాంపిళ్లను సేకరించారు. వీటిలో ఐదు శాంపిళ్లు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, మరో శాంపిల్‌లో మాత్రమే బ్రోమేట్ స్థాయి లీటరుకు 12 మైక్రోగ్రాములుగా నమోదైందని కంపెనీ తెలిపింది. అనుమతించిన గరిష్ఠ పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాములు కావడంతో ఆ శాంపిల్‌పై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఫలితాలపై 2025 నవంబర్ 22న కంపెనీ అప్పీల్ చేసుకుంది.

రీటెస్టింగ్‌లో భాగంగా రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీలో పరీక్షలు నిర్వహించగా, బ్రోమేట్ స్థాయి పరిమితిలోనే ఉన్నప్పటికీ పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAHs) ఉన్నట్లు గుర్తించినట్లు బిస్లరీ వెల్లడించింది. దీంతో మరో స్వతంత్ర ల్యాబొరేటరీలోనూ పరీక్షలు చేయించగా బ్రోమేట్ స్థాయి అనుమతించిన పరిమితిలోనే ఉన్నట్లు తేలిందని పేర్కొంది. ఈ పరీక్షల నివేదికలను 2026 ఫిబ్రవరి 2న FSSAI ప్రాంతీయ కార్యాలయానికి సమర్పించినట్లు తెలిపింది.

తాజాగా వెలువడిన ప్రాసిక్యూషన్ అనుమతికి సంబంధించిన సమాచారం తమకు నేరుగా లేదా ఇమెయిల్ ద్వారా అందలేదని బిస్లరీ స్పష్టం చేసింది. తమ తయారీ ప్రక్రియలో 10 దశల నాణ్యత నియంత్రణ విధానాన్ని అనుసరిస్తూ, 90కి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపింది. వినియోగదారులకు సురక్షితమైన తాగునీటిని అందించడమే తమ ప్రాధాన్యతని, ఈ వ్యవహారంలో FSSAIకి సహకరిస్తామని పేర్కొంది. కాగా, ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వడం నేరం నిర్ధారణ అయినట్లు కాదని, ఈ వ్యవహారంపై తదుపరి అధికారిక పరిణామాలు వెల్లడికావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment