హీరోయిన్ డింపుల్ హయాతి తన కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు తనను గ్లామర్ పాత్రలు, స్పెషల్ సాంగ్స్‌కే పరిమితమైన నటిగా చూశారని, అయితే శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ సినిమా తన ఇమేజ్ను పూర్తిగా మార్చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ.. తనలోని నటనను గుర్తించి, కొత్త తరహా పాత్రలో అవకాశం ఇచ్చిన తొలి దర్శకుడు సంపత్ నంది అని తెలిపారు. ఇందులో తాను పోషించిన ‘మందారం’ పాత్ర తన కెరీర్‌కు కొత్త దారి చూపిస్తుందని, సినిమాలో ఒక్క డ్యాన్స్ కూడా ఉండదని చెప్పారు.
మరోవైపు ‘భోగి’లో పాత తెలంగాణ యాసలో డైలాగులు చెప్పడం తనకు పెద్ద సవాల్‌గా మారిందని డింపుల్ వెల్లడించారు. దర్శకుడు సంపత్ నంది ప్రతి డైలాగ్ మాడ్యులేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని తెలిపారు. అనుపమ పరమేశ్వరన్తో కలిసి పనిచేయడం సరదాగా ఉందని, శర్వానంద్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు. ఈ నెల 27న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా, తమ కష్టానికి మంచి ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.








