కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు పోక్సో కేసులో కీలక ఊరట లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో అరెస్టై జైలులో ఉన్న భగీరథ్‌కు మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజనీరింగ్ పరీక్షలు రాయాల్సి ఉన్నందున బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు చేసిన వాదనలను పరిశీలించిన కోర్టు ఈ నెల 26 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో నెలరోజులకుపైగా జైలు జీవితం గడిపిన భగీరథ్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్టైంది.
గత నెలలో నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని వివిధ వర్గాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తగా, కొంతకాలం అజ్ఞాతంలో ఉన్న అతడు చివరకు పోలీసులకు లొంగిపోయాడు. అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించి జైలుకు తరలించారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు తాజాగా ఇచ్చిన బెయిల్ నిర్ణయం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసు తుది విచారణ, దర్యాప్తు ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది.








