ఆపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ నియామకం

ఆపిల్ కొత్త సీఈఓగా జాన్ టెర్నస్ నియామకం!

ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) సంస్థలో భారీ మార్పు చోటుచేసుకుంది. ప్రస్తుత సీఈఓ(CEO) టిం కుక్ (Tim Cook) సెప్టెంబర్ 1 నుంచి పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. ఆయన స్థానంలో కంపెనీకి చెందిన సీనియర్ అధికారి జాన్ టెర్నస్‌ (John Ternus) బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు దశాబ్దానికి పైగా కంపెనీని విజయవంతంగా నడిపించిన కుక్ (Cook).. ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌ గా కొనసాగుతారు.

ఆపిల్‌లో నాయకత్వ మార్పు మరోసారి ప్రపంచ టెక్ రంగం దృష్టిని ఆకర్షిస్తోంది. స్టీవ్ జాబ్స్ (Steve Jobs) తర్వాత 2011లో సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన టిమ్ కుక్ తన పదవీకాలంలో కంపెనీని అద్భుతమైన స్థాయికి తీసుకెళ్లారు. ఆయన నాయకత్వంలో ఆపిల్ మార్కెట్ విలువ ట్రిలియన్ల డాలర్ల స్థాయికి చేరుకుని ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. ఐఫోన్‌కే పరిమితం కాకుండా ఎయిర్‌పాడ్స్(AirPods), ఆపిల్ వాచ్ (Apple Watch) వంటి ఉత్పత్తులతో పాటు సర్వీసుల రంగాన్ని విస్తరించడం ద్వారా ఆపిల్‌ను ఒక శక్తివంతమైన ఎకోసిస్టమ్‌గా మార్చారు. అయితే కొత్త విప్లవాత్మక ఉత్పత్తులు పెద్దగా రాలేదన్న విమర్శలు ఉన్నప్పటికీ, స్థిరమైన వృద్ధి, బలమైన ఆపరేషనల్ మేనేజ్‌మెంట్ ఆయన పాలనలో ప్రధాన విజయాలుగా నిలిచాయి.

ఇప్పుడు ఆపిల్ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. కంపెనీ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ భవిష్యత్ నాయకత్వానికి ప్రధాన అభ్యర్థిగా భావించబడుతున్నారు. ఐఫోన్, మాక్, విజన్ ప్రో వంటి కీలక ఉత్పత్తుల అభివృద్ధిలో ఆయనకు దీర్ఘ అనుభవం ఉంది. ప్రస్తుతం కృత్రిమ మేధస్సు రంగంలో గూగుల్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు వేగంగా దూసుకుపోతున్న నేపథ్యంలో ఆపిల్‌పై పోటీ ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త నాయకత్వం ద్వారా AI సామర్థ్యాలు పెంచడం, హార్డ్‌వేర్ ఇన్నోవేషన్‌ను మరింత వేగవంతం చేయడం ఆపిల్ భవిష్యత్తు వ్యూహంలో కీలకంగా మారే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment