ప్రైవేటీకరణ లిస్టులోకి రిజిస్ట్రేషన్ సేవలు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

ప్రైవేటీకరణ లిస్టులోకి రిజిస్ట్రేషన్ సేవలు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు

Summarize with AI

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం (Chandrababu Naidu Government) ప్రభుత్వ ఆస్తులను (Government Assets), సేవలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీల (Medical Colleges) ప్రైవేటీకరణ (Privatization) ప్రస్తావన తేగా, ప్రతిపక్ష వైసీపీ(YSRCP) కోటి సంతకాల సేకరణ(One Crore Signatures Campaign), టెండ‌ర్లు ద‌క్కించుకుంటే కేసులు పెడ‌తామ‌న్న మాజీ సీఎం వార్నింగ్‌తో ఆ ప్ర‌క్రియ వాయిదా ప‌డింది. అయినప్పటికీ, ప్రభుత్వ వనరులను, ఆస్తులను ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయనే చర్చ రాష్ట్ర ప్రజల్లో జోరుగా సాగుతోంది.

చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఏర్ప‌డిన రెండేళ్ల‌లో ప్రైవేటీకరణ దిశగా పరిశీలిస్తున్న రంగాల జాబితా పెద్ద‌గానే ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. మొద‌ట ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆ తర్వాత ఫిషింగ్ హార్బర్ (Fishing Harbours), నిర్వహణ బాధ్యతలు, రామాయపట్నం పోర్ట్ (Ramayapatnam Port) భాగస్వామ్యం, అమరావతి మెరీనా (Amaravati Marina), బీచ్ రిసార్టులు(Beach Resorts), టూరిజం ఆస్తులు(Tourism Assets), APIIC పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, బస్టాండ్లు, మార్కెట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కేఎల్ రావు పార్క్ వాటర్ థీమ్ పార్క్, షిప్‌బిల్డింగ్ పార్కులు, జిల్లా రహదారులను పీపీపీ (ప‌బ్లిక్‌, ప్రైవేట్‌, పాట్న‌ర్‌షిప్‌) పేరుతో ప్రైవేటీకరణకు సిద్ధ‌ప‌డుతోంద‌ని ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్రైవేట్ వ్య‌క్తుల చేతుల్లోకి రిజిస్ట్రేషన్ సేవలు
తాజాగా అత్యధిక ప్రభుత్వ ఆదాయాన్ని, ప్రజలతో నేరుగా సంబంధం ఉండే రిజిస్ట్రేషన్ (Registration), స్టాంపుల (Stamps) శాఖను కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ‘పాస్‌పోర్ట్ సేవా కేంద్రం’ (Passport Service Center) మోడల్‌లో పీపీపీ(PPP) పద్ధతిలో 26 జిల్లాల హెడ్‌క్వార్టర్లలో ‘రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల (RSK)’ ఏర్పాటుకు రెవెన్యూ మంత్రి ఆనగాని సత్యప్రసాద్ జిఓ 396 విడుదల చేశారు.

ఈ విధానంలో భాగంగా ప్రైవేట్ భాగస్వామి సాంకేతికత, మౌలిక సదుపాయాలు, సిబ్బందిని ఏర్పాటు చేసుకుని ప్రతి డాక్యుమెంట్‌కు గరిష్టంగా రూ.2,000 వరకు ఫెసిలిటేషన్ ఛార్జీల రూపంలో వసూలు చేయడానికి అనుమతినిచ్చారు. 296 సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఈ విధానానికి మంచి స్పంద‌న వ‌స్తే రాష్ట్రమంతటా విస్తరించే యోచనలో చంద్ర‌బాబు ప్రభుత్వం ఉంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి – ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి
ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలను వదిలేసి, ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా చంద్ర‌బాబు ప్ర‌భుత్వ నిర్ణయాలు ఉన్నాయని, దీనివల్ల ప్రభుత్వ రాబడికి తీవ్ర గండి పడుతుందని ఆర్థిక నిపుణులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిర్ణయం వల్ల దశాబ్దాలుగా సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులపై (Sub-Registrar Office) ఆధారపడి జీవిస్తున్న డాక్యుమెంట్ రైటర్లు, డీటీపీ/ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకులు, స్టాంప్ వెండర్లు, డీడ్ అసిస్టెంట్లు సహా దాదాపు లక్ష కుటుంబాల ఉపాధి దెబ్బతింటుంది. దీనికి నిరసనగా విజయవాడ డాక్యుమెంట్ రైటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి జూలై 31 వరకు ‘పెన్ డౌన్’ సమ్మె చేపట్టారు.

ప్రజల భూముల వివరాలు, ఈసీలు(ECs), స్టాంప్ డ్యూటీ వసూళ్లు(Stamp Duty Collections), కోర్టు కేసుల సమాచారం వంటి అత్యంత గోప్యమైన డేటాను ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం డేటా భద్రతకే ముప్పని వైసీపీ(YSRCP) ఆరోపిస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణను తొలగించి ప్రైవేట్ ఆపరేటర్లను తీసుకురావడం వల్ల ల్యాండ్ మాఫియా, అక్రమ రియల్ ఎస్టేట్ సిండికేట్లకు దారులు సుగమం అవుతాయని, సామాన్యులు, రైతుల ఆస్తులు ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది.

గత ప్రభుత్వం డ్రోన్, జీపీఎస్, క్యూఆర్ కోడెడ్ డిజిటల్ సిస్టమ్స్ వంటి ఆధునిక వ్యవస్థలను తెస్తే, ప్రస్తుత ప్రభుత్వం కొత్తగా ఏమీ చేయకపోగా ఉన్న వ్యవస్థలను నాశనం చేస్తోందని వైసీపీ మండిపడింది. మొత్తానికి, అభివృద్ధి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న వరుస ప్రైవేటీకరణ నిర్ణయాలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment