5 శాతం సీట్ల వాటాతో.. గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరేస్తారా?

5 శాతం వాటాతో.. గ్రామాల్లో బీజేపీ జెండా ఎగరేస్తారా?

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేసిన వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటాలని, రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి మండలం నుంచి పార్టీకి ప్రాతినిధ్యం ఉండేలా కేడర్‌ పనిచేయాలని ఆయన సూచించారు.

కూటమిలో భాగస్వామిగా ఉంటూనే బీజేపీని రాష్ట్రంలో తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాధవ్‌.. రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలాన్ని చూపించాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో బీజేపీ వార్డు సభ్యులు ఉండేలా పనిచేయాలని, ఏపీలోని ప్రతి మండలం, గ్రామం నుంచి పార్టీకి ప్రాతినిధ్యం కల్పించేలా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని సూచించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి లక్ష్యం బలంగా ఉన్నప్పటికీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకాలు ఎలా ఉంటాయన్నదే అసలు ప్రశ్నగా మారింది. స్థానిక సంస్థల్లో బీజేపీకి కూటమి వాటాలో సుమారు 5 శాతం మాత్రమే దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.

అదే నిజమైతే.. కేవలం 5 శాతం సీట్లతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బీజేపీకి వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు? పార్టీని రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎలా మార్చగలరు? అనే ప్రశ్నలు రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి.

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కూటమి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీదే ప్రధాన బలం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, రాష్ట్రంలో పార్టీకి ఉన్న క్షేత్రస్థాయి క్యాడర్‌, స్థానిక రాజకీయ ప్రభావం కారణంగా సీట్ల పంపకాల్లో టీడీపీ కీలక పాత్ర పోషించే పరిస్థితి ఉంది.

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కోరుకుంటున్న స్థాయిలో స్థానిక సంస్థల సీట్లు సాధించడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కూటమిలో భాగస్వామిగా ఉంటూనే.. టీడీపీకి ధీటుగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయాలన్నది మాధవ్‌ లక్ష్యంగా కనిపిస్తోంది.

కానీ, టీడీపీ నిర్ణయించే సీట్ల వాటా కంటే ఎక్కువ స్థానాలను బీజేపీ డిమాండ్ చేయగలదా? ఒకవేళ ఎక్కువ సీట్లు కోరితే టీడీపీ అందుకు అంగీకరిస్తుందా? కూటమి ధర్మాన్ని కొనసాగిస్తూనే బీజేపీ తన స్వతంత్ర బలాన్ని పెంచుకోవ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నేనా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

మాధవ్‌ పెట్టుకున్న లక్ష్యం పెద్దది. కానీ ఆ లక్ష్యానికి తగ్గట్టుగా బీజేపీకి స్థానిక సంస్థల్లో సీట్లు దక్కుతాయా? టీడీపీ 5 శాతానికి మించి వాటా ఇస్తుందా? లేక కూటమి సర్దుబాట్లలో బీజేపీ ఆశలు పరిమితమవుతాయా? అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న.

Join WhatsApp

Join Now

Leave a Comment